జాతి విద్వేష ఉద్రిక్తతలే ఎన్నికల ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పదేపదే ఖండిస్తూ శ్వేతజాతి మద్దతుదారులను పదిలం చేసుకుంటున్నారు. మరి ఈ వ్యూహాన్ని అనుసరించి విజయం సాధిస్తారా అనే విషయాన్ని పక్కనబెడితే.. ట్రంప్ తీరు పట్ల సొంతపార్టీ సభ్యులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబర్బన్​ ప్రాంతాల్లోని ఓట్లపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే సొంత పార్టీ నేతల సలహాలను ట్రంప్ పెడచెవిన పెడుతున్నారు.

 

 

తన విద్వేషపూరితమైన భాషతో ప్రజల మధ్య ఎన్నో ప్రసంగాలు చేశారు ట్రంప్. కానీ ఇటీవలి కాలంలో తన ట్విట్టర్​ ఖాతాలో మరింత విజృంభిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తన మద్దతుదారుడు ఒకరు 'వైట్​ పవర్' అంటూ నినాదాలు చేసిన వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసి కాసేపటికే డిలీట్ చేశారు. నల్లజాతీయుల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాన్ని 'విద్వేష చిహ్నం'గా అభివర్ణించారు.కాన్ఫెడరేట్ జెండాను తొలగించినందుకు నాస్కార్​ అనే రేసింగ్​ సంస్థపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ట్రంప్​. కాన్ఫెడరేట్ అనేది సాధారణంగా వివాదాస్పద జాతివిద్వేష జెండాగా భావిస్తారు. అంతేకాకుండా కాన్ఫెడరేట్ వారసత్వాన్ని ముక్తకంఠంతో వెనకేసుకు వస్తున్నారు ట్రంప్. జార్జి వాషింగ్టన్, థామస్ జెఫ్ఫెర్​సన్​ల గురించి మాట్లాడిన ట్రంప్ కాన్ఫెడరసి గురించి మాత్రం ఎలాంటి ప్రస్తావన చేయలేదు.

 

ట్రంప్​ చేస్తున్న వ్యాఖ్యలన్నీ అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్​ చేసిన వ్యాఖ్యలకు దగ్గరగా ఉన్నాయి. శ్వేతజాతీయుల ఓటర్ల కోసం నిక్సన్ రచించిన దక్షిణాది వ్యూహాన్నే (సదరన్ స్ట్రాటజీ) ట్రంప్ అనుకరిస్తున్నట్లు తెలుస్తోంది. తన మద్దతుదారులను అభివర్ణించడానికి నిక్సన్ ఉపయోగించే 'సైలెంట్ మెజారిటీ' అనే పదాన్ని సైతం ట్రంప్ విరివిగా ఉపయోగిస్తున్నారు.
శ్వేతజాతీయులను ప్రసన్నం చేసుకోవడమే అధ్యక్షుడి వ్యూహంగా కనిపిస్తోందని ట్రంప్ మాజీ ప్రచార సభ్యులు చెబుతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం తనను ఎన్నుకున్న శ్వేత జాతీయుల్లో ట్రంప్ వ్యవహారం కాస్త ఉత్సాహం కలిగిస్తుందని స్పష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: