దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఒక్కరోజు కేసులు తొలిసారిగా 27 వేలకు పైగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87 లక్షల 20 వేలకు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య కూడా 22 వేలు దాటింది. మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నా.. ధారవిలో వైరస్ ను బాగా కంట్రోల్ చేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. 

 

దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో రోజురోజుకీ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 27 వేల 114 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 20 వేల 916కి చేరింది. ఒక్కరోజులోనే 519 మంది చనిపోయారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 2 లక్షల 83 వేల 407 మంది చికిత్స పొందుతుండగా.. 5 లక్షల 15 వేల 386 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 22 వేల 123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో కేసులు రావడం ఇదే ప్రథమం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది.

 

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 7 వేల 862 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 38 వేల 461కి చేరింది. మహారాష్ట్రలో 95 వేల 647 యాక్టివ్ కేసులున్నాయి. పుణె జిల్లాలో జులై 13 నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజే.. రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. థానే జిల్లాలో కూడా లాక్ డౌన్ ఈ నెల 19కి వరకు పొడిగించారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవి కరోనా దెబ్బకు భారీగా ప్రభావితం అవుతుందని అంచనాలున్నా.. అక్కడ వైరస్ ను బాగా కట్టడి చేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసల జల్లు కురిపించింది. అధికారులు దూకుడుగా పనిచేయడం వల్లే అది సాధ్యమైందని చెప్పింది. 

 

ఢిల్లీలో కొత్తగా 2 వేల 89 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య లక్ష 9 వేలకు చేరింది. అయితే కరోనా రికవరీ రేటు భారీగా పెంచుకున్న ఢిల్లీ.. దాన్ని 77 శాతానికి తీసుకెళ్లింది. కరోనా బారిన పడ్డ ప్రతి నలుగురు బాధితుల్లో ముగ్గురు కోలుకుంటుండటంతో కేజ్రీవాల్ సర్కారు ఊపిరి పీల్చుకుంటోంది. కరోనాతో గత 24 గంటల్లో 42 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 3 వేల 3 వందలకు చేరింది. 

 

తమిళనాడులో 58.2 కేసులు చెన్నైలోనే ఉన్నాయి. కొద్ది రోజులుగా చెన్నైలో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టగా.. గత 16 రోజుల్లో మధురైలో కరోనా తీవ్రత ఐదు రెట్లు పెరిగింది. అటు యూపీలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. సోమవారం ఉదయం వరకూ లాక్ డౌన్ కొనసాగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లాంటి ఎనిమిది రాష్ట్రాల్లోనే 90 శాతానికి పైగా కరోనా కేసులున్నాయి. 80 శాతం కేసులు 49 జిల్లాల్లోనే ఉన్నాయి. 

 

ఈశాన్య రాష్ట్రమైన అసోంలో కరోనా కేసుల సంఖ్య 15 వేలు దాటింది. కొత్తగా 936 పాజిటివ్ కేసులొచ్చాయి. గౌహతి సిటీలోనే 6 వేల 221 కేసులున్నాయి. గత 17 రోజుల్లోనే 5 వేల 778 కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. అసోం పక్కనే ఉన్న త్రిపురలో సోమవారం నుంచి డోర్ టు డోర్ యాంటీజెన్ టెస్టులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. మణిపూర్, నాగాలాండ్, దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్, అండమాన్ నికోబార్ దీవులు, మిజోరం, సిక్కింలో ఇంతవరకూ కరోనాతో ఎవరూ చనిపోలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: