కరోనా మహాసంక్షోభం దేశదేశాల్లో భిన్నరంగాల్ని, వ్యవస్థల్ని ఇప్పట్లో కోలుకోలేనంతగా గట్టి దెబ్బ తీసింది. కొవిడ్‌ పాలబడకుండా కాచుకునే ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా పౌరులు భౌతికదూరంతోపాటు ఇతర జాగ్రత్తలూ పాటించడాన్ని తప్పనిసరి చేసేసింది. ఊహాతీతంగా మారిన పరిస్థితుల్లో దేశీయంగానూ పాలన, విద్యారంగాల్లో కొత్త యోచనలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, సర్కారీ కార్యాలయాల్లోనే కాదు- క్షేత్రస్థాయి స్థితిగతుల్నీ కళ్లకు కట్టే కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ అవతరణకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే సుముఖత చాటింది.


 నేడది ‘కరోనా వ్యాప్తి భయం ఉండదు... దస్త్రాల నిర్వహణ సులభతరమై పారదర్శకత, విశ్వసనీయత పెరుగుతాయి’ అంటూ ఇ-కార్యాలయాలకు ఓటేస్తోంది. త్వరలోనే మండలాఫీసు నుంచి సచివాలయం దాకా కంప్యూటర్ల ద్వారా ఆన్‌లైన్‌ పాలనకు రంగం సిద్ధమవుతోంది. నెల్లాళ్లక్రితమే అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ విద్యాబోధనకు శ్రీకారం చుట్టిన కేరళ 40లక్షల మందికి డిజిటల్‌ పాఠాలు చెబుతోంది.

అంతర్గత ఫైళ్ల నిర్వహణ యాంత్రీకరణ నిమిత్తం పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ కేంద్రబోర్డు గత నెలలోనే 'ఇ-ఆఫీస్‌' విధానం ప్రవేశపెట్టింది. కాగితాలతో పనే లేని ప్రభుత్వ కార్యాలయాలను అంచెలవారీగా అవతరింపజేసేందుకు హరియాణా లాంటిచోట్ల ప్రయత్నాలు మొదలయ్యాయి. ‘కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన’ స్ఫూర్తికి పట్టం కడుతూ ఈశాన్య రాష్ట్రాలన్నింటా ఇ-ఆఫీస్‌ ప్రాజెక్టు చేపడుతున్నట్లు కేంద్రం ఇటీవలే వెల్లడించింది! ఆన్‌లైన్‌ పద్ధతికి మళ్లితే యంత్రాంగం పని సామర్థ్యం ఇనుమడిస్తుంది. అనుమతుల మంజూరు కోసం ప్రజానీకం అధికార సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేసే దురవస్థ తప్పుతుంది.


సహజంగానే అవినీతీ తగ్గుముఖం పడుతుంది. ఇవన్నీ సాకారం కావాలంటే ఊరూరా ఇంటింటా అంతర్జాల సదుపాయం అందుబాటులోకి రావాలి! దేశీయంగా ఎలెక్ట్రానిక్‌ పాలన ప్రణాళికలు రెండు దశాబ్దాలుగా వినవస్తున్నా, పౌరులందరికీ అంతర్జాల (ఇంటర్‌నెట్‌) సౌకర్యం సమకూర్చి ఆన్‌లైన్‌లో వేగంగా ప్రభుత్వసేవలు అందించేందుకంటూ 'డిజిటల్‌ ఇండియా' పథకం ప్రారంభమైంది 2015లో.


మూడేళ్ల తరవాత, 2022 నాటికి అందరికీ బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయాల్ని కల్పించడమే లక్ష్యమని టెలికాం నూతన విధాన ముసాయిదా ఘనంగా చాటింది. ‘భారత్‌ నెట్‌’ ద్వారా లక్షా ముప్ఫైవేల గ్రామ పంచాయతీలు, 48వేలదాకా గ్రామాలు అనుసంధానమయ్యాయని, మొత్తం రెండున్నర లక్షల పంచాయతీల్లో డిజిటల్‌ శకం చురుకందుకుంటుందని ఈ ఏడాది మొదట్లో కేంద్రం వెల్లడించినా- వాస్తవం వేరు. పనులు పరిపూర్తి అయినట్లు అమాత్యులు చెబుతున్న గ్రామపంచాయతీల్లో కేవలం ఎనిమిది శాతమే నెట్‌ సేవలకు సిద్ధంగా ఉన్నట్లు విశ్లేషణలు స్పష్టీకరిస్తున్నాయి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: