బీకామ్ ఫిజిక్స్...ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌నే. పాపం ఓ ఇంటర్వ్యూలో తెలిసి తెలియక బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటది ఉంటది అంటూ చెప్పి సంచలనమే సృష్టించారు. ఇక తర్వాత నుంచే జలీల్ ఖాన్ పేరు కంటే బీకామ్ ఫిజిక్స్ అంటేనే అందరికీ తెలుస్తోంది. ఈ బీకామ్ ఫిజిక్స్ మేటర్ పక్కనపెడితే, జలీల్ ఖాన్ ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.

 

రెండుసార్లు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ 2014లో వైసీపీ తరుపున గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇక 2019 ఎన్నికలకొచ్చేసరికి ఆయన పోటీ నుంచి తప్పుకుని, తనయురాలు షబానాకు టిక్కెట్ దక్కేలా చేసుకున్నారు. అయితే జగన్ గాలిలో షబానా 7 వేల మెజారిటీ తేడాతో వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. ఓడిపోయాక షబానా అమెరికా వెళ్ళిపోయారు. ఇటు జలీల్ కూడా వయసు మీద పడటంతో, పెద్దగా పార్టీలో తిరగడం లేదు.

 

ఈ క్రమంలోనే వెస్ట్‌పై చంద్రబాబు భక్తుడు బుద్దా వెంకన్న పట్టు తెచ్చుకోవడానికి చూస్తున్నారట. నెక్స్ట్ ఎన్నికల్లో వెస్ట్ సీటుని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట. బాబు కూడా బుద్దాకు సీటు ఫిక్స్ చేసేలా ఉన్నారట. ఇదే సమయంలో వెస్ట్ సీటు కోసం నాగుల్ మీరా ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎంపీ కేశినేని నాని వర్గంలో ముఖ్యుడుగా ఉన్న నాగుల్ మీరా, 2019 ఎన్నికల్లోనే జలీల్ ఖాన్ కుమార్తెకు చెక్ పెట్టి సీటు దక్కించుకోవాలని చూశారు.

 

కానీ బాబు మాత్రం జలీల్ కుమార్తెకు సీటు కేటాయించారు. దీంతో నాగుల్ మీరా సైడ్ అయిపోయారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా సీటు దక్కించుకోవాలని నాగుల్ మీరా చూస్తున్నారు. కేశినేని అండ ఉండటంతో సీటు రావడం ఖాయమని అనుకునున్నారు. కాకపోతే బాబు మాత్రం బుద్దా వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక వెస్ట్ సీటు ఎవరికి ఇచ్చినా కూడా బీకామ్ ఫిజిక్స్‌కు మాత్రం షాక్ తగలడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: