రాష్ట్రంలో వరుసగా టీడీపీ నేతల అరెస్ట్‌లు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ నేత హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. ఇక ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మెడకు కూడా చుట్టుకుంది. ఇప్పటికే ఆయన మాజీ పీఎస్ మురళీమోహన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలో విధుల్లో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేశారు.

 

ఇక ఈ స్కామ్‌లో ఆయన తనయుడు వెంకట సురేష్‌ని కూడా అరెస్ట్ చేయడానికి ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. పితాని మంత్రిగా ఉన్న సమయంలో సురేష్ కొన్ని కంపెనీలకు మందుల కొనుగోలు చేసేందుకు సిఫార్స్ చేసినట్లు ఏసీబీ విచారణలో తేలిందట. అయితే కుమారుడు అరెస్ట్‌ని ముందుగానే గ్రహించి పితాని హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

 

అయితే ఈ విషయాన్ని పక్కనబెడితే, ఎప్పుడైతే అచ్చెన్న అరెస్ట్ అయ్యారో, అప్పటి నుంచి పితాని అరెస్ట్ కూడా ఖాయమని ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే పితాని వైసీపీలోకి వెళ్లిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దాంతో ఈ అరెస్ట్ అంశం కాస్త పక్కకు వెళ్లింది. పితానికి జగన్ దగ్గర నుంచి ఆఫర్ వచ్చిందని తెలిసింది. ఆయన వైసీపీలోకి వస్తే నెక్స్ట్ ఎన్నికల్లో నరసాపురం ఎంపీ సీటుని ఇస్తానని జగన్ దగ్గర నుంచి హామీ వచ్చినట్లు పితాని అనుచర వర్గాల నుంచి సమాచారం వచ్చింది.

 

ప్రస్తుతం ఎలాగో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీకి దూరమైపోయారు కాబట్టి, నెక్స్ట్ ఆ సీటుని బీసీ వర్గాల్లో పట్టున్న పితానికి ఇస్తానని వైసీపీ అధిష్టానం దగ్గర నుంచి హామీ వచ్చిందట. పైగా పితానిని నరసాపురం పంపిస్తే, ఆచంటలో మంత్రి శ్రీరంగనాథ రాజుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించారు. కానీ పితాని జగన్ ఆఫర్‌ని లైట్ తీసుకున్నట్లు సమాచారం. నెక్స్ట్ ఆచంట నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే, బాబు మళ్ళీ మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని , అలాంటప్పుడు వైసీపీకి వెళ్ళి నరసాపురం ఎంపీగా బరిలో దిగడం ఎందుకని పితాని జగన్ ఆఫర్‌ని పట్టించుకోలేదని తెలిసింది. ఇక ఆఫర్ లైట్ తీసుకోవడం వల్లే, ఇప్పుడు పితాని ఇబ్బందులో పడినట్లు అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: