విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఆయన పెత్తనమే ఎక్కువ నడుస్తోంది. మెజారిటీ నియోజకవర్గాల్లో బొత్స డామినేషన్ ఉంటుంది. ఇక ఈయన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో అయితే బొత్స ఆధిపత్యానికైతే తిరుగులేదు. ఆయనకు చెక్ పెట్టడం ప్రత్యర్ధులకు సైతం కుదరదు.

 

2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన బొత్స, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున చీపురుపల్లి నుంచి పోటీ చేసి 42 వేల ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచారు. అయితే కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా అయిపోవడంతో బొత్స వైసీపీలోకి వెళ్ళి 2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచి, ఇప్పుడు జగన్ కేబినెట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

 

అయితే చీపురుపల్లిలో బొత్సకు చెక్ పెట్టడం అంతా సులువైన పనికాదు. ప్రస్తుతం చీపురుపల్లి టీడీపీ బాధ్యతలని మాజీ మంత్రి కిమిడి మృణాలిని తనయుడు కిమిడి నాగార్జున చూసుకుంటున్నారు. 2014లో మృణాలిని బొత్సపై గెలిచి, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కానీ అనేక అవినీతి ఆరోపణలు రావడంతో, మృణాలిని కేబినెట్ నుంచి మధ్యలోనే తప్పించారు.

 

ఇక 2019లో బొత్సపై నాగార్జున పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి నాగార్జున పెద్దగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. ఎప్పుడు విశాఖలోనే ఉంటున్నారు.  పైగా అమెరికా నుంచి రావడంతో నాగార్జునకు లోకల్ పాలిటిక్స్‌పైన ఎలాంటి పట్టు లేదు. అందులోనూ బొత్స లాంటి నాయకుడు చెక్ పెట్టాలంటే నాగార్జున కెపాసిటీ సరిపోదు. దీంతో చీపురుపల్లిలో టీడీపీని బ్రతికించుకోవాలంటే చంద్రబాబు, నాగార్జునని పక్కనపెట్టేయాల్సిందే అని విజయనగరం తమ్ముళ్ళు అంటున్నారు.

 

ఇదే సమయంలో చీపురుపల్లిపై గట్టి పట్టున కె. త్రిమూర్తులు రాజుని బాధ్యతలు అప్పగిస్తే బొత్సకు గట్టి పోటీ ఇవ్వొచ్చని చెబుతున్నారు. మృదుస్వభావిగా మంచి పేరున్న త్రిమూర్తులు రాజుకు చీపురుపల్లిలో మంచి ఫాలోయింగ్ ఉంది. 2019 ఎన్నికల్లోనే చీపురుపల్లి సీటు ఆశించి, భారీ ర్యాలీ తీశారు. కానీ బాబు...ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో త్రిమూర్తులు రాజు వెనక్కి తగ్గారు. కానీ బొత్స లాంటి నేతకు చెక్ పెట్టాలంటే త్రిమూర్తుల రాజునే కరెక్ట్ అని అర్ధమవుతుంది. పైగా బొత్స తూర్పు కాపులు కాబట్టి, అపోజిట్‌లో క్షత్రియ కులానికి చెందిన త్రిమూర్తులుకు చీపురుపల్లి బాధ్యతలు అప్పగిస్తే, టీడీపీ ఏమన్నా బ్రతికే ఛాన్స్ ఉంది. అలా కాకుండా బాబు, నాగార్జునని పక్కనపెట్టకపోతే, చీపురుపల్లిలో టీడీపీ పేరు మర్చిపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: