ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటి 26 లక్షలు దాటింది. 5 లక్షల 63 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అమెరికాలో ఏకంగా ఒక్కరోజే దాదాపు 70 వేల కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ కరోనా కేసుల్లో అమెరికా, బ్రెజిల్, ఇండియాలోనే ఎక్కువ కేసులున్నాయి. 

 

వరుసగా మూడో రోజూ కరోనా కొత్త కేసుల్లో అమెరికా రికార్డు సృష్టించింది. 24 గంటల్లో ఏకంగా 69 వేల కేసులు నమోదయ్యాయి. గురువారం వైరస్ తో అమెరికాలో 120 మంది చనిపోగా.. శుక్రవారం 92 మంది మృత్యువాత పడ్డారు. అలస్కా, జార్జియా, ఇదాహో, లూసియానా, మోంటానా, ఓహియో, ఉటా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వచ్చాయి. 

 

టెక్సాస్ లో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో.. మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు. కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటించకపోతే.. బిజినెస్ లు మళ్లీ షట్ డౌన్ అవుతాయని హెచ్చరించారు. 8 వేల మంది ఖైదీల్ని ముందస్తుగా విడుదల చేస్తున్నట్టు కాలిఫోర్నియా ప్రకటించింది. శాన్ క్వాంటిన్ జాతీయ జైలు పరిసరాల్లో కరోనా విస్తరించడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. జైల్లో సగానికి పైగా ఖైదీలు కరోనా పాజిటివ్ గా తేలడంతో కలవరం రేగింది. 

 

ఓర్లాండోలో ఉన్న థీమ్ పార్క్ కు పరిమిత సంఖ్యలో అతిథుల్ని అనుమతిస్తామని వాల్ట్ డిస్నీ సంస్థ ప్రకటించింది. ఉద్యోగులతో పాటు అతిథులు కూడా కచ్చితంగా మాస్కులు ధరించాలని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని స్పష్టం చేసింది. థీమ్ పార్క్ లో అత్యంత ప్రజాదరణ పొందిన పలు షోలను ఇప్పటికే రద్దు చేసినట్టు డిస్నీ సంస్థ ప్రకటించింది. థీమ్ పార్క్ ఉద్యోగులతో కూడిన 19 వేల మంది.. పార్క్ అప్పుడే తెరవొద్దని పిటిషన్ పెట్టారు. ఓర్లాండాలో ఉన్న ఇతర థీమ్ పార్క్ లు జూన్ లోనే తెరుచుకున్నాయి.

 

ఫ్లోరిడా రాష్ట్రం అమెరికాలో కరోనా హాట్ స్పాట్ గా ఉంది. ఫ్లోరిడాలో 48కి పైగా ఆస్పత్రులు.. తమ దగ్గర ఉన్న బెడ్లన్నీ నిండిపోయాయని ప్రకటించాయి. ఈ నెలలో ఫ్లోరిడాలో కరోనా తీవ్ర ప్రభావం చూపించింది. ఏ యూరప్ దేశంలోనూ లేని స్థాయిలో.. ఇక్కడ రికార్డు స్థాయి రోజువారీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో 31 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 3 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. న్యూయార్క్ నర్సింగ్ హోముల్లో కరోనా నియంత్రణ కోసం.. పేషంట్ల కోసం వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధించారు. కెంటకీ రాష్ట్రంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. 

 

అమెరికా తర్వాత బ్రెజిల్లో అత్యధికంగా 18 లక్షలకు పైగా కరోనా కేసులున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 28 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది సరికొత్త రికార్డని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మరోవైపు కరోనా పుట్టిల్లు చైనాలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దక్షిణ కొరియాలో కొత్తగా 35 కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 13 వేలు దాటింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: