తమ్మినేని సీతారాం. తెలుగు రాజకీయాల్లో తలపండిన గట్టి పిండం. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన తరువాత తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలోని  ఆముదాలవలస నుంచి పోటీ చేసి గెలిచి నాటి కాంగ్రెస్ దిగ్గజం బొడ్డేపల్లి రాజగోపాల్ ని ఓడించారు. ఇక ఆ తరువాత పలు మార్లు అదే సీటు నుంచి గెలిచిన తమ్మి నేని టీడీపీని వీడారు. అధినేత చంద్రబాబు విధానాలు నచ్చకనే ఆయన అలా చేశారు. వైసీపీలో చేరిన ఆయనను రాజకీయ అద్రుష్టం వరించి మళ్లీ ఆముదాలవలసలో జెండా పాతారు.

 


ఆయన గెలిచిన తరువాత మంత్రి పదవి కోరుకున్నారు. అయితే జగన్ ఆయన్ని స్పీకర్ గా చేశారు. ఆ పోస్ట్ లో తమ్మినేని కుదురుకున్నా కూడా ఆయన పోకడ పూర్తిగా రాజకీయంగానే ఉంటూ వచ్చింది. దాంతో తమ్మినేని స్పీకర్ గా కంటే మంత్రిగానే రాణిస్తారు అని వైసీపీలో కూడా  అంటున్నారు. ఆయన మనసులో ఉన్న భావన అదే. తన రాజకీయ జీవితంలో మరో మారు మంత్రి కావాలని తమ్మినేని అనుకుంటున్నారు.

 

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దిగ్గజ నేతగా, బీసీ నేతగా ఉన్న తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తే గట్టిగా టీడీపీని ఢీ కొడతారని, టీడీపీ బీసీ వాదనకు చెల్లు చీటి ఇచ్చినట్లు అవుతుందని జగన్ భావిస్తున్నారుట. ఇపుడు మంత్రిగా ఉన్న ధర్మాన క్రిష్ణదాస్ దూకుడు రాజకీయం చేయలేకపోవడం వంటి వాటి వల్ల కూడా తమ్మినేనికి అవకాశాలు పెరిగాయని అంటున్నారు.

 

ప్రత్యేకించి  టీడిపీ బీసీ కార్డు అచ్చెన్నాయుడుని అదుపు చేయాలంటే తమ్మినేని కరెక్ట్ అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారుట. ఇక చంద్రబాబు సమకాలీకుడిగా తమ్మినేని ఆయన‌కు ధీటైన జవాబు అవుతావని, వైసీపీని అన్ని విధాలుగా ఆదుకుంటారని కూడా జగన్ నమ్ముతున్నారుట. మొత్తానికి చూసుకుంటే తమ్మినేనికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జోరుగా సాగుతోంది. మరి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: