వరుస వరుసగా టీడీపీ నాయకులంతా జైలు బాట పడుతున్నారు. మరికొందరు ఆ బాట పట్టేలా కనిపిస్తున్నారు. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్న నాయుడు అరెస్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ వంటి వారు అరెస్ట్ అవ్వగా, మరో మాజీ మంత్రి పితాని చుట్టూ ఈఎస్ఐ కుంభకోణం కేసు చుట్టుకుంది. ఇప్పటికే ఆయన వద్ద పిఎస్ గా పనిచేసిన మురళి ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పితాని కుమారుడు వెంకట్ సురేష్ కోసం గాలింపు చేపట్టారు. ఇలా వరుసగా టిడిపి నాయకులు అందరూ అరెస్ట్ అవుతూ వస్తున్నారు. అలాగే మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హత్య కేసులో జైలుపాలయ్యారు. ఈ విధంగా టిడిపి నాయకులంతా అరెస్ట్ అవుతుండడంతో, టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు, ఆ పార్టీ నాయకులు అందరిలోనూ భయాందోళనలు పెరుగుతున్నాయి.

 

IHG

వీరంతా అనేక అవినీతి వ్యవహారాల్లో చిక్కుకున్న విషయాన్ని పక్కన పెట్టి, వారు ఫలానా కులం వారు కాబట్టే వైసీపీ ప్రభుత్వం వేధించి మరి అరెస్టు చేస్తోంది అని అదే పనిగా టిడిపి ప్రచారం చేస్తుంది. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదంతా ఇలా ఉంటే, అసలు అరెస్ట్ అవుతున్న నాయకులు ఏ తప్పు చేయలేదా ? ఏ తప్పూ చేయకుండానే వారిని ఏపీ ప్రభుత్వం కావాలని అరెస్టు చేయిస్తుందా ? వారు గత టీడీపీ ప్రభుత్వంలో నీతి, నిజాయితీగా వ్యవహరించినా, ఇప్పుడు వేధింపులకు గురవుతున్నారా అనే విషయాలను చంద్రబాబు సైతం క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. అచ్చెన్న నాయుడు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని, కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన అరెస్ట్ అయ్యారు అని, అలాగే కొల్లు రవీంద్ర మోకా భాస్కరరావు అనే వ్యక్తి హత్య నేరం కేసులో బలమైన సాక్ష్యాలు ఉన్న కారణంగానే పోలీసులు అరెస్టు చేశారని, ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు వెనుక కూడా కారణాలను ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

 

నకిలీ పత్రాలు సృష్టించి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆయన వాహనాలు అమ్మిన వ్యవహారంలో రవాణా అధికారుల ఫిర్యాదు మేరకు ఆయన అరెస్టు అయ్యారని, ఇందులో ఏపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడే అవకాశమే  లేదని, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు అంటూ వైసిపి గట్టిగా చెబుతున్న విషయాన్ని పక్కన పెట్టి , కేవలం కులాల లెక్కలు బయటకు తీసి పాత తరహా రాజకీయాలు చేస్తే జనాలు నమ్మేస్తారా అన్నట్టుగా టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: