దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి వల్ల ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు వస్తున్నాయి. యువతలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయి నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. చేయడానికి పని లేక కొందరు ఇబ్బందులు పడుతుంటే పని చేసినా గిట్టుబాటు కాక మరికొందరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 
 
లాక్ డౌన్ వల్ల బతుకు భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఉపాధి లేక చాలామందికి కుటుంబ పోషణ భారమైంది. కొత్త అప్పులు పుట్టడం లేదు. ఉన్న అప్పులకు వడ్డీలు కట్టలేక ఒత్తిడికి గురయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కుల వృత్తులు, చేతి వృత్తులపై ఆధారపడిన వారికి పదివేల నుంచి 20వేల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. 
 
లక్షల్లో ఉద్యోగాలు పోవడంతో పాటు ఐటీ, మాల్స్‌, షోరూమ్‌లు, బిల్డింగ్‌ కన్స్ట్రక్షన్‌‌, ఆటోలు, క్యాబ్‌లు, హోటళ్లు, పర్యాటకం, మానుఫాక్చరింగ్‌, సినిమా వంటి ఇండస్ట్రీలన్నీ ఎప్పుడు కోలుకుంటాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొన్ని సంస్థలు ఉద్యోగులను తీసేయడంతో లక్షల మంది రోడ్డున పడ్డారు. ఒత్తిళ్లకు గురవుతూ, ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం లభించక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. 
 
అయితే ఇలాంటి సమయంలో యువత నిరాశానిస్పృహలకు లోను కాకుండా ధైర్యంగా ముందడుగులు వేయాలి. కొత్త అవకాశాలను సృష్టించుకోవడానికి ప్రయత్నించాలి. కంప్యూటర్ పై అవగాహన ఉంటే ఆన్ లైన్ జాబ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించాలి. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాను నియంత్రించడం కష్టమేమీ కాదని గుర్తుంచుకోవాలి. పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఒక్క అవకాశం జీవితాన్నే మార్చేస్తుంది. నిరాశతో ప్రాణాలు కోల్పోతే మనపై ఆధారపడి, నమ్మకం పెట్టుకున్న కుటుంబ సభ్యుల ఆశలను వమ్ము చేసినట్లే అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: