వాడి వ‌య‌సు 19 ఏళ్లు. కుర్రోడే క‌దా అని అను‌కుంటున్నారా?ఎంత పెద్ద కుట్ర‌కు ప్లాన్ చేశాడో...దాన్ని ఎలా అమ‌లు చేశాడో తెలిస్తే షాక్ అవ‌డం కాదు క‌దా ఇంత దారుణంగా ప‌రిస్థితు‌లు, ఆలోచ‌న‌లు మారిపోతున్నాయా అంటారు. అంత‌టి దుర్మార్గానికి పాల్ప‌డిన వ్య‌క్తి త‌ల్లిదండ్రులు ఏం చేసేవారో తెలుఆస‌? బ‌్యాంక్ ఉద్యోగులు. భారత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నకిలీ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఔనండి. నకిలీ మందులు తెలుసు. కానీ నకిలీ బ్యాంకు ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోకండి. బ్యాంకుల పేరుతో మోసం చేయడం విన్నాం కానీ ఇలా ఏకంగా బ్యాంకుకే మోసం చేశాడు తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన కమల్‌బాబు అనే 19 ఏళ్ల‌ యువకుడు.

 

కుట్ర‌కు పాల్ప‌డిన కమల్‌బాబు కుటుంబం గొప్ప‌దే. ఆయ‌న తల్లిదండ్రులు బ్యాంకులో మాజీ ఉద్యోగులు. కమల్‌ తండ్రి ఎస్బీఐలో పనిచేసి రిటైరై పదేళ్ల‌ కింద మరణించాడు. తల్లి రెండేళ్ల‌ కింద పదవీ విరమణ చేశారు. బ్యాంక్ ఉద్యోగులైన త‌ల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొందాల్సిన క‌మ‌ల్ ఇంకో రీతిలో బ్యాంక్ వాతావ‌ర‌ణాన్ని వాడుకున్నాడు. ఇంట్లో ఖాళీగా ఉన్న స‌మ‌యంలో సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌ని రబ్బరు స్టాంపులు తయారు చేసే మాణిక్యం, ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని కుమార్‌తో చేతులు కలిపాడు. న‌కిలీ బ్యాంక్ ప్రారంభించుదామ‌ని ప్లాన్ చేశారు. కమల్‌ తల్లిదండ్రులు బ్యాంకులో పనిచేశారని తెలియడంతో ప్లాన్‌కు ఓకే చెప్పారు. దీంతో ముగ్గురూ కలిసి మూడునెలల కింద పన్‌రుతిలో బ్యాంకును ఏర్పాటు చేశారు. 

 


అయితే,ఈ న‌కిలీ బ్యాంక్ సాఫీగా సాగుతున్న స‌మ‌యంలోనే ఓ షాక్ త‌గిలింది. ఈ బ్రాంచ్‌పై ఒక కస్టమర్‌కి అనుమానం వచ్చి తన ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్‌కు సమాచారమిచ్చారు. ఆయన వెంటనే ఈ విషయాన్ని జోనల్‌ ఆఫీస్‌కు చేరవేశారు. దీంతో పన్‌రుతిలో రెండు బ్రాంచ్‌లు మాత్రమే ఉన్నాయని, మూడో బ్రాంచ్‌ని ఎక్కడా ప్రారంభించలేదని వారు నిర్ధరించారు. దీంతో బ్యాంక్ అధికారులు రంగ ప్ర‌వేశం చేశారు. ఆ స‌మ‌యంలో వారి మైండ్ బ్లాంక‌యింది. ఎస్బీఐ బ్రాంచ్‌కి ఏమాత్రం తీసిపోకుండా అక్కడ ఏర్పాటు చేసిన కంప్యూటర్లు, ఇతర సదుపాయాలను చూసి అధికారులు షాక్‌ అయ్యారు.  మూడు నెలలుగా కొనసాగుతున్న నకిలీ బ్యాంకులో అప్పటివరకూ ఎలాంటి లావాదేవీలు జరుగకపోవడం, ఎవరూ నష్టపోకపోవటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: