దేశంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. వైరస్ ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. అప్రమత్తత, జీవన విధానంలో మార్పుల వల్ల వైరస్ ను నియంత్రించే అవకాశాలు ఉన్నా కొంతమంది ప్రజల నిర్లక్ష్యం వల్ల వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందుతూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా... ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు అమలు చేస్తున్నా ప్రజల్లో మార్పు రాకపోతే అనుకున్న ఫలితం రాదు. 
 
జనతా కర్ఫ్యూ సమయంలో ప్రజలు ప్రదర్శించిన స్పూర్తి వైరస్ అదుపులోకి వచ్చే వరకు జనం చూపించాల్సి ఉంది. నిపుణులు స్వీయ నిర్భంధం, భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించడం ద్వారా వైరస్ నియంత్రణ సాధ్యమేనని చెబుతున్నారు. అన్ లాక్ సడలింపులు అమలులోకి వచ్చిన రోజు నుండి దేశంలో కరోనా విజృంభణ పెరిగింది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. 
 
దీంతో పలు రాష్ట్రాలు తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కర్ణాటక, నాగాలాండ్, మేఘాలయ, మహారాష్ట్ర రాష్ట్రాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 14 నుంచి ఏడు రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుంది. బెంగళూరు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఈ నెల 14వ తేదీ రాత్రి 8 గంటల నుంచి జులై 22వ తేదీ ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ లాక్ డౌన్ అమలు కానుంది. 
 
నాగాలాండ్ లో జులై 31 వరకు లాక్ డౌన్ అమలు కానుండగా.... అధికారులు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని సూచనలు చేస్తున్నారు. జులై 13, 14 తేదీలలో మేఘాలయలో కఠినమైన లాక్ డౌన్ అమలు కానుంది. మహారాష్ట్ర రాష్ట్రంలో జులై 31 వరకు కఠినంగా లాక్ డౌన్ అమలు కానుంది. ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ అమలు కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: