కరోనాతో మరణించిన వారికి చేసే అంత్యక్రియలు  వర్ణనాతీతం. కుటుంబ సభ్యుల చివరి చూపు కూడా నోచుకోవలేని పరిస్థితి. ప్లాస్టిక్ కవర్ తో శరీరాన్ని చుట్టేసి పూర్తిగా ప్యాక్ చేస్తారు. అంబులెన్స్ లో స్మశాన వాటికలకు తరలించి శవాలను కుప్పలు కుప్పలుగా పడేసి కాల్చేస్తున్నారు.

 

 

ఆ నలుగురు సినిమాలో ‘ ఒక్కరై రావడం.. ఒక్కరై పోవడం అంటూ పాటను రచించారు సినీ గేయ రచయిత. పుట్టినప్పుడు భూమిపై ఒక్కరే వచ్చి.. చివరికి స్మశానం నుంచి ఒంటరిగానే వెళ్లిపోతారనే ఆ పాట సారాంశం. కానీ, ప్రస్తుతం కోవిడ్-19తో చనిపోయిన వారి విషయంలో కనీసం స్మశాన వాటిక వరకూ అయిన వాళ్లు, కుటుంబ సభ్యులు ఖననానికి రాలేని పరిస్థితి.

 

 

హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఉన్న స్మశానవాటికలో నిత్యం ఇలాంటి ఘటనలే ఎదురవుతాయి. ప్రతి రోజు పదికి పైగా కరోనాతో మరణించిన వారిని ఇక్కడ దహనం చేస్తున్నారు కోవిడ్ సిబ్బంది. శుక్రవారం ఏకంగా 38 మందిని ఇక్కడ సామూహిక దహనం చేశారు. ఈ సంఘటనను చూసిన వారెవరైనా కన్నీరు పెట్టాల్సిందే.

 

 

కరోనాతో మరణించి వారిని ఈఎస్ ఆసుపత్రి సమీపంలోని స్మశానవాటికకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కోవిడ్-19తో చనిపోయిన వారి చుట్టు ప్లాస్టిక్ కవర్ చుట్టి అంబులెన్స్ లో స్మశానవాటికకు తీసుకువచ్చి కుప్పలు తెప్పలుగా పడేసి కాలుస్తున్నారు. కుటుంబ సభ్యులు దూరం నుంచే అంత్యక్రియలు చూస్తూ కన్నీరు కార్చుతున్నారు. కరోనాతో చనిపోయిన వారు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు సామూహిక దహనం చేస్తున్నారు. దీంతో సిబ్బందికి కష్టమవుతోంది. 

 

 

చితిలో సగం కాలిన దేహాలను కుక్కలు పీక్కుతింటున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 5వ తేదీన సగం కాలిన శరీరాన్ని ఓ వీధి కుక్క పీక్కుతిన్న సంఘటన అందరికి తెలిసిందే. శవాలను ఒకే చోట చేర్చి, డీజిల్ జల్లి చితి పేర్చుతున్నారు.  బాధితుల కుటుంబ సభ్యులు లేకపోవడం.. కాటికాపరులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతోందని స్థానికులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: