రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఎమ్మెల్యేలకు 15 కోట్ల వరకూ ఇవ్వడానికి రెడీ అయ్యారని చెప్పారు. అందర్నీ కలుపుకుపోవాలని తాము ప్రయత్నిస్తున్నా.. బీజేపీ మాత్రం ఇబ్బందులు తెచ్చిపెడుతోందని మండిపడ్డారు గెహ్లాట్. మరోవైపు ఈ ఆరోపణల్ని రికార్డు చేయాలని కోరుతూ రాజస్థాన్ పోలీసులు.. సీఎంకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. 

 

రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాన్ని తాము వమ్ము చేశామని, అయినా కాషాయ పార్టీ నేతలు అదే పనిలో ఉన్నారని ఆరోపించారు. రాజస్థాన్లో కరోనా నియంత్రపై ప్రభుత్వం శ్రద్ధ పెడుతుంటే.. ఇదే అదనుగా బీజేపీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వల విసురుతోందన్నారు గెహ్లాట్. బీజేపీ వాజ్ పేయి కాలం నాటి పార్టీ కాదని.. 2014 గెలుపు తర్వాత ఆ పార్టీ బహిరంగంగానే పద్ధతి లేని రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన గెహ్లాట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 15 కోట్ల వరకు డబ్బు ఇవ్వజూపారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

రాజస్థాన్ బీజేపీలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు బాధ్యతలు ముగ్గురు నేతలకు అప్పగించారన్న అశోక్ గెహ్లాట్.. ఎమ్మెల్యేల సంఖ్యను పెంచే విషయంలో ఆ ముగ్గురి మధ్య పోటీ ఉందన్నారు. ఇటీవలి కాలంలో కర్ణాటక, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాల్ని బీజేపీ కూల్చిన తీరును గెహ్లాట్ గుర్తుచేశారు. అంతకుముందు గోవాలో, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కాషాయ పార్టీ అదే పని చేసిందన్నారాయన. మోడీ, అమిత్ షా అధికారం కోసం వికృత క్రీడకు తెరతీశారని, బహిరంగంగానే తప్పుడు పనులు చేయడానికి వెనుకడాటం లేదని ఆరోపించారు గెహ్లాట్. అయితే ఎలాంటి ప్రలోభాలనైనా ఎదుర్కుని తమ ప్రభుత్వం కొనసాగగుతుందని గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు.

 

రాజస్థాన్ అసెంబ్లీ మొత్తం బలం 200. ఇందులో కాంగ్రెస్ కు 107 మంది సభ్యుల బలం ఉంది. వీరిలో బీఎస్పీ నుంచి గెలిచిన ఏడుగురు కాంగ్రెస్ రెబల్స్ కూడా ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు 13 మందిలో 12 మంది కాంగ్రెస్ కే మద్దతు పలుకుతున్నారు. అటు బీజేపీపై చేసిన హార్స్ ట్రేడింగ్ ఆరోపణల్ని రికార్డు చేయాలని రాజస్థాన్ పోలీసులు గెహ్లాట్ ను కోరారు. అశోక్ గెహ్లాట్ తో పాటు డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, కాంగ్రెస్ విప్ కు నోటీసులు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: