కేరళ గోల్ట్‌ స్కామ్‌మ కేసులో ఎన్‌ఐఏ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుంది. కేరళలో మాయమైన స్వప్న సురేష్‌, సందీప్ నాయర్‌లు బెంగుళూరులో ప్రత్యక్షమయ్యారు. వీరిని కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు.

 

కేరళలో తీవ్ర కలకలం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసులో నిందితులైన స్వప్న సురేష్‌, సందీప్‌ నాయర్‌లను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. బెంగుళూరులోని బీటీఎం లేఔట్ ద‌గ్గర‌ నిందితులను అరెస్ట్ చేశారు. స్వప్న సురేష్ కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎన్ఐఏ అధికారులు కొచ్చిలోని కోర్టులో హాజరు పరిచారు. 

 

యూఏఈ ఎంబసీకి చెందిన పార్శిల్లో జులై 4న..15 కోట్ల రూపాయల విలువైన 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య కార్యాలయానికి చెందిన ప్యాకేజీలో బంగారం దొరకడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. సీఎం ఆఫీస్‌లోని ప్రధాన కార్యదర్శిపై కూడా ఆరోపణలు రావడం, సీఎం పినరయి విజయన్‌ను ప్రతిప‌క్షాలు టార్గెట్ చేయ‌డంతో.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని... ప్రధాని న‌రేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు కేర‌ళ సీఎం.. దీంతో.. కేంద్ర హోంశాఖ, ఎన్ఐఏను రంగంలోకి దించింది. అయితే.. శుక్రవారం రంగంలోకి దిగిన ఎన్ఐఏ.. 24 గంటలు గడవకముందే ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుంది. 

 

తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ఒక గోల్డ్ కంజైన్‌మెంట్‌ను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అయితే మరికొన్ని బ్యాగుల ద్వారా కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి బంగారం అక్రమ రవాణా అయినట్టు ఎన్ఐఏ అనుమానిస్తోంది. దేశ ఆర్ధిక వ్యవస్థను, జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా టెర్రర్ నెట్‌వర్క్ ద్వారా భారీ ఎత్తున బంగారం అక్రమంగా రవాణా జరిగినట్టు ఎన్ఐఏ భావిస్తోంది. ఈ స్కామ్ వెనుక వ్యక్తులపై ఇప్పటికే కేసులు నమోదు చేసింది.

 

స్వప్నసురేష్‌ గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ కాన్సులేట్‌లో ఉద్యోగిణిగా పనిచేసింది. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో తిరువనంతపురంలోని స్పేస్‌ సిస్టమ్స్‌ పార్క్‌లో అపాయింట్‌మెంట్ తీసుకుంది. బంగారాన్నిఅక్రమంగా తరలిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడింది. అప్పటి నుంచి మిస్సింగ్‌లో ఉన్న స్వప్న సడెన్‌గా బెంగుళూరులో ప్రత్యక్షమైంది. కర్ణాటక, కేరళలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నప్పటికీ వీరు బెంగుళూరులో ప్రత్యక్షమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: