ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అలా వైరల్ అవుతున్న వార్తల్లో కొన్ని వాస్తవాలు కాగా మరికొన్ని అవాస్తవాలు. చాలా మంది వైరల్ అవుతున్న వార్తల్లో ఏవి నిజమో ఏవి అబద్ధమో నిర్ధారించుకోకుండానే ఇతరులకు పంపుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పథకం ఆడపిల్లలకు అద్భుతమైన పథకమని... ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కేంద్ర ప్రభుత్వం 24 వేల రూపాయలు ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. 
 
వాట్సాప్, ఫేస్ బుక్ లలో గత కొన్ని రోజులుగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే వాస్తవం ఏమిటంటే కేంద్రం అలాంటి పథకాన్ని అమలు చేయడం లేదు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే భయం అవసరం లేదని... ప్రధాని మోదీ ఉచితంగా డబ్బు పంచుతారని వైరల్ అవుతున్న వార్త నిజం కాదు. ప్రస్తుతం ఎంతోమంది కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోందని ఇతరులకు షేర్ చేస్తున్నారు. మరికొంతమంది ఆ పథకానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఇతరులకు సలహాలు ఇస్తున్నారు. 
 
అసలు అలాంటి పథకమే అమలులో లేకపోతే దరఖాస్తు చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది...? ప్ర‌ధాన‌మంత్రి క‌న్యా ఆశీర్వాద్ యోజ‌న పేరుతో ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు గురించి ఎక్కడా చెప్పలేదు. ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో(పీఐబీ) తాజాగా ఈ పథకం గురించి స్పందించి స్పష్టతనిచ్చింది. వైరల్ అవుతున్న మెసేజ్ లు ఫేక్ మెసేజ్ లు అని పేర్కొంది. 
 
ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే ఆ సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని సూచించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పథకం లేనే లేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే విషయాలలో నిజాలను, అబద్ధాలను నిర్ధారించుకుని ఇతరులకు పంపటం ఉత్తమం. 

మరింత సమాచారం తెలుసుకోండి: