ఎంత‌టి విష‌యాన్నైనా ముక్కు సూటిగా చెప్పేయ‌డం శ‌ర‌ద్‌ప‌వార్‌కే చెల్లుతుంది. చైనాతో భార‌త్ అనుస‌రించాల్సిన విధానంపై కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లుగా త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాన్ని చెప్పేశారు. భారత్‌, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. చైనా సైనిక శక్తి భారత్‌ కంటే పది రెట్లు బలీయమైనదని  పేర్కొన్నారు.  శివసేన పత్రిక 'సామ్నాకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో  కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  భార‌త్‌కు ప్రథమ శత్రువు పాకిస్తాన్‌ అని అందరు భావిస్తారు కానీ, పాక్‌ కంటే చైనాతోనే దేశానికి ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు.దేశాల మ‌ధ్య ప‌ర్య‌ట‌న‌లు సాగించినంత మాత్ర‌నా..షేక్‌హ్యాండ్స్ ఇచ్చి పుచ్చుకున్నంత ఈజీగా స‌మ‌స్య‌లు స‌మ‌సిపోవ‌ని..శాంతిభ‌ద్ర‌తలు వ‌ర్ధిల్ల‌వ‌ని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

 


 అదే స‌మ‌యంలో దేశ‌మంతా ఐక్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన స‌మ‌య‌మ‌ని అన్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా కేంద్ర ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వాల‌ని, విలువైన స‌ల‌హాలివ్వాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం కూడా బాధ్యాత‌తో స‌ల‌హాలు స్వీక‌రించాల‌ని హిత‌వు ప‌లికారు. చైనా పాక్‌ దేశాలు మాత్రమే భారత్‌కు శత్రువులు కావని,  నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలు కూడా భారత్‌కు శత్రు దేశాలే అని అన్నారు. బంగ్లాదేశ్‌లోని అంతర్గత సమస్యను భారత్‌ పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే బంగ్లాదేశ్‌ మాత్రం చైనాతో ఒప్పందాలు చేసుకుంటుందని ద్వజమెత్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముఖ్య అంశాలలో సైతం ప్రతిపక్షాలను సంప్రదించడం లేదని శరద్‌ పవార్‌ విమర్శించారు. 

 


మ‌హారాష్ర్టలో జూలై 31 వ‌ర‌కు విధిందిన లాక్‌డౌన్ నిబంధ‌న‌ల్ని స‌డ‌లిస్తూ రాష్ర్ట ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వ్య‌వ‌హారంలో శ‌ర‌ద్ ప‌వార్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని, అస‌లు  లాక్‌డౌన్ నిబంధ‌న‌ల్ని స‌డ‌లించ‌డం సీఎం ఉద్ద‌వ్‌కు ఏ మాత్రం ఇష్టం లేద‌ని ప‌లు ఊహాగానాలు వినిపించిన విష‌యం తెలిసిందే. మ‌హారాష్ర్ట‌లో లాక్‌డౌన్ స‌డ‌లింపు అంశంపై  ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే, త‌న‌కు మ‌ధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు త‌లెత్త‌లేద‌ని ఎన్సీపీ చీఫ్‌ శ‌ర‌ద్ ప‌వార్ స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రికి అభిప్రాయ బేధాలు త‌లెత్తాయ‌న్న వార్త‌ల్ని ప‌వార్ ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: