అదే ప్లాన్‌, అదే టార్గెట్‌. సింపుల్ స్కెచ్‌. ఊహించ‌ని రీతిలో మధ్యప్రదేశ్‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు రాజ‌స్థాన్‌లో సేమ్ సీన్ స్కెచ్ వేస్తోంది. సీనియ‌ర్ నేత‌ను ప‌ద‌వి నుంచి కూల్చిన రీతిలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ఆగ్రహంతో ఉన్న యువ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్.. మధ్యప్రదేశ్ సింధియా రాజకీయాన్ని వంటబట్టించుకున్నట్టు కనిపిస్తున్నది.  పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, ఏదో ఒకటి తేల్చుకునేందుకు ఈ యువ నేత సోనియాగాంధీతో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ పయనమై వెళ్లాడు. చిత్రంగా అప్పుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్ యువ‌నేత సింధియా లాగే.

 

 

రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ తిరుగుబాట్ల మధ్య రాజస్థాన్ నుంచి సుమారు 12 మంది ఎమ్మెల్యేలను హోటల్ కు తరలించారు. వీరిలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉన్నారు. శనివారం సాయంత్రం నాలుగు రైళ్లలో గురుగ్రామ్ లోని మనేసర్ సమీపంలో ఉన్న ఐటీసీ గ్రాండ్ భారత్ హోటల్ కు 12 ఎమ్మెల్యేలను తరలివచ్చారు. వీరిలో 10 మంది కాంగ్రెస్, ఇద్దరు ఇండిపెండెంట్లు ఎమ్మెల్యేలుగా చెప్తున్నారు. కాగా,  తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని సచిన్ పైలట్ ఆగ్రహంతో ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే సచిన్ పైలట్ కు చెందిన వర్గంలోని 24 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చారని కూడా మీడియా కథనాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఈ ఎమ్మెల్యేల్లో కొందరు సోనియా గాంధీని కలవడానికి ఆదివారం ఢిల్లీ వెళ్లవచ్చని వార్తలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ నుంచి చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మార్చిలో ఇక్కడే బస చేశారు. అనంతరం కమల్ నాథ్ ప్రభుత్వాన్ని మైనారిటీకి తీసుకురావడానికి స్క్రిప్ట్ ఈ హోటల్ నుంచే రచించింది. అంటే స్కెచ్ సేమ్‌. అదే మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఆప‌రేష‌న్‌. 

 

 

అంతకుముందు జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. మంత్రుల సమావేశాన్ని ఏర్పాటుచేయగా సచిన్ పైలట్ గైర్హాజరయ్యారు. అనంత‌రం  సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ,  ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేను 25-25 కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, కరోనా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ విషయాలన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఈ నాటకాలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా విమర్శించారు. మ‌ళ్లీ రాహుల్ కోట బీట‌లు వార‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం తెర‌మీద‌కు వ‌స్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: