రాజ‌స్థాన్ కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న‌ అభిప్రాయ బేధాలు రాజ‌కీయ సంక్షోభానికి దారితీసే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. సీఎం గెహ్లాట్‌, డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ల మ‌ధ్య నెల‌కొన్ని బేదాభిప్రాయాలు చినికిచినికి గాలివాన‌గా మారాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియా తిరుబాటు మరువకముందే ఇప్పుడు రాజస్థాన్‌లో మరో సీనియర్ నేత పైలట్ కూడా అదే బాటలో ఉండటంతో ఇప్పుడు కాంగ్రెస్ హై కమాండ్ తల పట్టుకుంటోంది. సచిన్ పైలట్‌ను ఎలాగైనా నచ్చజెప్పేందుకు కాంగ్రెస్ కీలక నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయ‌న మాత్రం ఎవ‌రికీ క‌నీసం ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ రాజస్థాన్  పీసీసీ చీఫ్, డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌తోపాటు ఆయన అనుచరుడు మంత్రి రమేష్ మీనాకు నోటీసులు జారీ చేయ‌డం అగ్నికి ఆజ్యం పోసిన‌ట్ల‌యింది. ఇది పార్టీలో ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని పైల‌ట్ వ‌ర్గీయులు పేర్కొంటున్నారు. పొమ్మ‌న‌లేక పొగ‌బెడుతున్నారంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. మొత్తంగా పార్టీలోని అంత‌ర్గ‌త పోరుతో బ‌ల‌హీనంగా త‌యార‌వుతోంద‌ని, విప‌క్షాల‌కు బ‌లంగా మారుతోంద‌న్న ఆందోళ‌న‌ను శ్రేణులు వ్య‌క్తం చేస్తున్నాయి. 

 

అయితే రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోంభం నెల‌కొనే ప‌రిస్థితులు ప్ర‌స్పుటంగా కనిపిస్తున్నా..అధిష్ఠానం మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంపై సీనియ‌ర్ నేత‌లు పెద‌వి విరుస్తున్నారు. రాజస్థాన్‌లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా అదిష్టానం స్పందికపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 'కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై ఆందోళన  చెందుతున్నాను. కట్టేసిన కొయ్యల నుంచి గుర్రాలు తెంచుకున్న​ తర్వాత మాత్రమే మనం మేల్కొంటామా' అంటూ  రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపై ఆవేదన వ్యక్తం చేశారు.మ‌రో కాంగ్రెస్ నాయకుడు వివేక్‌ టాంకా ఇలాంటి ఆందోళనల వల్ల పార్టీ బలహీనపడుతుందని పేర్కొన‌గా...ఆల్కా లాంబా అనే నాయ‌కుడు ఇలాంటి సమయంలో సహనమే విజయానికి కీలకమంటూ వ్యాఖ్య‌నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: