ఏపీలో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేయాలి. ఈ పదవుల కోసం పెద్ద ఎత్తున పోటీ సాగుతోంది. జగన్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే మంత్రి కావాలన్న వారి ఆశలు వైసీపీలో చాలా ఎక్కువమందికి ఉన్నాయన్నది నిజం. ఎందుకంటే 151 సీట్లు ఆ పార్టీకి వచ్చాయి కాబట్టి.  ఇక మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 22 న కానీ లేక 24న కానీ జరుగుతుంది అంటున్నారు. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు  ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు.

 


కాగా,  జగన్ రెండున్నరేళ్ల తరువాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసారు. కానీ అనూహ్యంగా ఏడాదికే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సివచ్చింది. ఈ ఇద్దరూ బీసీ నేతలు కావడంతో ఆ వర్గాల నుంచి వత్తిడి ఎక్కువగా ఉంది. పైగా గుంటూరుకు చెందిన మోపిదేవి వెంకటరమణ స్థానంలో అదే జిల్లాకు చెందిన వారు ప్రయత్నాలు గట్టిగా చేసుకుంటున్నారు.

 

ఇక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో అదే జిల్లాకు చెందినవారు కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ రెండు జిల్లాలు, బీసీ సామాజికవ‌ర్గం వారు కాకుండా మిగిలిన వారు ఇతర జిల్లాల వారు కూడా మంత్రి పదవి కోసం క్యూలో ఉన్నారు. మరి వారందరిలో ఎవరికి అవకాశాలు ఉంటాయన్నది ఒక ప్రశ్నగా ఉంది.

 

ఇంతకీ జగన్ ఇద్దరి ఖాళీలని ఇద్దరితోనే భర్తీ చేసి ఊరుకుంటారా లేక మరింతమందిని తీసుకుంటారా. అలా కనుక చేస్తే మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో చేపట్టాల్సి ఉంటుంది. ఇపుడున్న పరిస్థితుల్లో అలాటి ప్రయోగం చేస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని కూడా అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ మంత్రివర్గంలో కొత్త వారిని చేర్చుకునేందుకు ముహూర్తం పెట్టేశారు. మరి కేవలం ఇన్ మాత్రమే  ఉంటుందా లేక అవుట్ కూడా ఉంటుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: