వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు ఇపుడు అధినాయకత్వానికి తలనొప్పిగా మారారు. ఆయన మీద వైసీపీ హై కమాండ్ లోక్ సభ స్పీకర్ కి ఈసరికే ఫిర్యాదు చేసింది. అది పెండింగులో ఓ వైపు ఉంటే మరో వైపు వైసీపీలోని అసమ్మతి నేతలు కొందరు మళ్ళీ జూలు విదిలిస్తున్నారు. వారిలో అగ్రభాగాన ఒక మాజీ మంత్రి గారు ఉన్నారు.

 

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఈ మధ్య జగన్ సర్కార్ మీద ఘాటు విమర్శలు చేసిన సంగతి విధితమే. ఇపుడు ఆయన మళ్లీ అలజడి రేపారు. ఏకంగా వైసీపీ అధినాయకత్వం మీద కత్తులు దూసిన రఘురామక్రిష్ణం రాజు తో కలసి సెల్ఫీ దిగడం ఇపుడు చర్చగా ఉంది. ఆ సెల్ఫీ వైరల్ కావడంతో రాజు గారి రూట్లో నెల్లూరు పెద్దాయన కూడా పయనిస్తున్నారా అన్న డౌట్లు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.

 

ఇప్పటికే ఆనం తన కోపాన్ని అంతా వైసీపీ అధినాయకత్వం  మీద ప్రదర్శించేశారు. పేరుకే  ఏడాది పాలన ఎందుకు సంబరాలు అంటూ రుసురుసలాడారు కూడా. ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ ఎంపీ రాజు గారి బాటలో ఆయన పయనించడానికి సిధ్ధంగా ఉన్నట్లుగా సెల్ఫీ ద్వారా సంకేతాలు ఇచ్చారా అన్న చర్చ వైసీపీలో సాగుతోంది.

 

నెల క్రితం ఆయన తన అసంత్రుప్తిని వెళ్ళగక్కినా కూడా వైసీపీ పెద్దలు పట్టించుకోలేదు. పైగా ఆయన ప్లేస్ లో నేదురుమల్లి జగనాధనరెడ్డి కుటుంబానికి చెందిన రాం కుమార్ రెడ్డికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇక లాభం లేదని ఆనం బీజేపీ వైపు వెళ్లలనుకుంటున్నట్లుగా న్యూస్ వస్తోంది.

 

ఇవన్నీ ఎలా ఉన్నా ఆయన రఘురామక్రిష్ణం రాజు తో సెల్ఫీ దిగడాన్ని మాత్రం వైసీపీ హైకమాండ్ ఎలా చూస్తుందో అన్న చర్చ గట్టిగా సాగుతోంది. ఒక్క సెల్ఫీతో ఆనం రెడ్డి గారు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా  కాక రేపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: