ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని బీజేపీ, జనసేన పార్టీ కీలక నేతల సమావేశం అభిప్రాయపడింది. పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వేగంగా విస్తరిస్తున్న వ్యాధిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పని చేయడం లేదని సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యదర్శి వి.సతీష్ జీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి నివారణలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది రక్షణలో సర్కారు వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ఇరు పార్టీల అగ్రనాయకులు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో బీజేపీ నుంచి సతీష్ జీతోపాటు జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోధర్, రాజ్యసభ సభ్యుడు, అధికార ప్రతినిధి జి.వి.ఎల్.నరసింహ రావు, పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్, జనసేన నుంచి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

 

 

కరోనా నివారణలో ఎక్కడ లోటుపాట్లు ఉంటే అక్కడ ప్రజా పక్షాన నిలబడి పోరాటం చేయాలని ఉభయపక్షాల నేతలు నిర్ణయించారు.ఈ విపత్కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు అవుతుందో అధ్యయనం చేసిన తరువాత వాటి వివరాలను మీడియాతో పంచుకోవాలని నిర్ణయించారు. ఇప్ప‌టికే ఆత్మనిర్భర భారత్ కు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను విస్తృతంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా గరీబ్ కళ్యాణ్ యోజన, సూక్ష్మ- చిన్న- మధ్య స్థాయి పరిశ్రమలు, వాణిజ్య సంస్థ   (ఎం.ఎస్.ఎం.) లకు అమలు చేస్తున్న పధకాల తీరుతెన్నులపై పర్యవేక్షణ జరిపి సమీక్షించాలని సమావేశం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు లబ్ధిదారులకు అందించ లేకపోయిందని సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 9 వేల కోట్ల రూపాయలను అందించిందని సమావేశం గుర్తు చేసింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాలని, దీని కోసం కార్యాచరణను సిద్ధం చేయడానికి కొద్ది రోజులలో మరోసారి ఇటువంటి సమావేశం నిర్వహించాలని సమావేశం నిశ్చయించింది.

 

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకం, ప్రభుత్వ భూములు, గుంటూరు మార్కెట్ అమ్మకం, విద్యుత్ బిల్లుల విషయంలో బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా జరిపిన పోరాటంపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. అదే విధంగా లాక్ డౌన్ కాలంలోనూ, ఆ తరువాత ఇబ్బందులు ఎదుర్కొన్నవారికి నిత్యావసరాలు అందించి ఆదుకున్న తీరుపై సమావేశంలో పాల్గొన్న నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సేవ ఇలా కొనసాగాలని ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: