ఉత్తరాంధ్రా వైసీపీకి పట్టం కట్టింది. అలా ఇలా కాదు ఏకంగా  మొత్తానికి మొత్తం సీట్లు ఓట్లూ రాసిచ్చేంది. దానికి ధన్యవాదాలు చెప్పేందుకు అన్నట్లుగా విశాఖను పాలనారాజధాని చేస్తామని వైసీపీ సర్కార్ భారీగా ప్రకటించింది. అది ఇవాళో రేపో కచ్చితంగా  అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 


ఇవన్నీ ఇలా ఉంటే రేపటి రోజున రాజధాని విశాఖకు వస్తే రాజకీయంగా మరింత బలపడాలని వైసీపీ ప్లాన్ వేస్తోంది. దానికి తగినట్లుగా పావులు కదుపుతోంది.  దాంతో ఆపరేషన్ ఆకర్ష్ మంత్రానికి తెర తీస్తోంది. అయితే ఈసారి మాజీ మంత్రులు, నేతలు, పొలిటికల్ బిగ్ షాట్స్ మీద కన్నేసినట్లుగా ప్రచారం సాగుతోంది.

 

మూడు జిల్లాలోనూ టీడీపీకి బీసీ నేతలు పెద్ద ఎత్తున ఉన్నారు. వారి అండ చూసుకునే చంద్రబాబు అక్కడ రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఇపుడు వారి మీద వైసీపీ వల విసురుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో కొందరు మెల్లగా మెత్తబడుతున్నట్లుగా తెలుస్తోంది. వారి స్వప్రయోజనాలు, ఆర్ధిక లావాదేవీలు, వ్యాపార వ్యవహారాల ద్రుష్ట్యా అధికార పార్టీ వైపుగా రావడం అవసరం.

 

దాంతో వైసీపీ ఒడుపుగానే తన వంతు రాజకీయం చేస్తోంది. ఈ పరిణామాలతో ఇపుడు టీడీపీలో అలజడి రేగుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రాలో ఘోర ఓటమి తరువాత దిగాలు పడి చతికిలపడిన టీడీపీకి ఇపుడు పులి మీద పుట్రలా వైసీపీ ఆపరేషన్ మంత్ర కనుక సక్సెస్ అయితే పార్టీ దారుణంగా దెబ్బతింటుందన్న ఆందోళన‌ ఉంది. మరి ఆ పెద్ద నాయకులు ఎవరో  ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.

 

ఇప్పటికే టీడీపీ కంచుకోటగా పేరున్న ఉత్తరాంధ్రాను మంచుకోట చేసి ఏకంగా విజయనగరం జిల్లాను పూర్తిగా కైవశం చేసుకుని మిగిలిన రెండు జిల్లాల్లో వైసీపీ పాగా వేసింది. ఇక ఈ విజయాన్ని శాశ్వతం చేసుకోవడానికి వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆ దూకుడు రాజకీయంతో విపక్షం విలవిలలాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: