రెండోసారి భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం....దేశమంతా కాషాయం రంగు నింపడమే లక్ష్యంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసి ఉంది. కానీ ఊహించని విధంగా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకు చావుదెబ్బలు తగిలాయి. అయితే చావుదెబ్బలు తిన్నకూడా బీజేపీ అస్సలు తగ్గడం లేదు. కిందపడిపోయినా పైచేయి మాదే అన్నట్లుగా...ఆ రాష్ట్రాల్లో కూడా కాషాయం రంగు నింపడానికి ప్రయత్నిస్తున్నారు.

 

ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఆపరేషన్ కమలం జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి బీజేపీ అధికార పీఠం కైవసం చేసుకుంది. ఇక కర్ణాటక తర్వాత బీజేపీ కన్ను మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పడింది. అక్కడ యువనాయకుడు జ్యోతిరాధిత్య సింధియాని అడ్డం పెట్టుకుని కమల్‌నాథ్ సర్కార్‌ని పడగొట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ పాగా వేసింది.

 

సరే ఈ రెండు చోట్ల బీజేపీ కాస్త స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి ఆపరేషన్ కమలం చేశారు అనుకుంటే, కాంగ్రెస్ స్ట్రాంగ్‌గా ఉన్న రాజస్థాన్‌పై మోదీ-షా ద్వయం కన్నుపడింది. అందుకే ఆ రాష్ట్రంలో కూడా ఆపరేషన్ కమలం విజయవంతమయ్యేలా ప్లాన్ నడిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ యువనాయకుడు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌కు వల వేసేసింది. ఇక ఆయన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేలని పట్టుకుని హస్తినలో తిష్ట వేశారు. దీంతో అతి త్వరలోనే రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పడిపోయి, కాషాయ పాలన మొదలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

రాజస్థాన్ కథ కూడా ముగియనుండటంతో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ మహారాష్ట్ర అని తెలుస్తోంది. అక్కడ శివసేన-ఎన్‌సి‌పి-కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు షా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటం వల్లే బీజేపీ ఈ విధంగా రాష్ట్రాల్లో వేరే ప్రభుత్వాలని పడగొట్టి అధికార పీఠాలని కైవసం చేసుకుంటుంది. కాకపోతే ఇలా కూల్చడమే మోదీ బలం అవుతుందా? అంటే ఖచ్చితంగా కాదనే విశ్లేషుకులు అంటున్నారు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకునే రాష్ట్రాలని కైవసం చేసుకుంటున్నారని, అదే జనం మద్ధతుతో దక్కించుకుంటే అప్పుడు అసలు బలం అవుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అప్పుడు బీజేపీ బలం ఏంటో తెలిసిపోతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: