తిరుగులేని నాయకుడిగా ప్రజల మన్ననలు పొంది, తనకంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి కుటుంబానికి ప్రస్తుతం క్లిష్ట పరిస్థితే నడుస్తుందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఎదిగి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించిన పరిటాల రవి కుటుంబానికి టీడీపీ ఎప్పటికప్పుడు పెద్ద పీట వేస్తూనే వచ్చింది. రవి చనిపోయిన దగ్గర నుండి ఆ కుటుంబానికి అండగా ఉంటూ 2014లో అధికారంలోకి వచ్చాక కూడా పరిటాల సునీతకి మంత్రి పదవి ఇచ్చారు.

 

అయితే ఫ్యామిలీకి ఒక సీటు అని చంద్రబాబు కండిషన్ పెట్టడంతో సునీత ఈసారి తనయుడికి టికెట్ ఇవ్వాలని కోరడంతో 2019లో పార్టీ అధిష్టానం రాప్తాడు టికెట్ పరిటాల శ్రీరామ్ కి ఇచ్చింది. ఇక జనం మాత్రం వైసీపీ యువనేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతికే రాప్తాడు పగ్గాలు అప్పగించారు. ఓడిపోయిన దగ్గర నుంచి రాప్తాడులో పరిటాల ఫ్యామిలీ ప్రాభవం తగ్గిపోయింది. అసలు రాజకీయంగా ఎంతో ఘన చరిత్ర కలిగిన పరిటాల ఫ్యామిలీ ఓటమి నుంచి ఎప్పుడు తిరిగి పుంజుకుంటుంది? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కష్టతరమే అని చెప్పాలి. ఎందుకంటే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎప్పటికప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ అందరి అభిమానం మూటగట్టుకుంటున్నాడు. ప్రతిక్షణం ప్రజల కోసం పని చేస్తున్నాడు. నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా దూసుకుపోతున్నాడు.

 

ఇదిలా ఉండగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా పరిటాల కుటుంబానికి ఎక్కడా స్కోప్ ఇవ్వట్లేదు. గత ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లిపోవడంతో పార్టీ అధినేత చంద్రబాబు ధర్మవరం బాధ్యతలు కూడా పరిటాల కుటుంబానికే  అప్పగించారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రజలతో మమేకం అవుతూ వారికి సంక్షేమ పథకాలన్నీ అందించడంతో ముందంజలో ఉన్నారు. ఎక్కడా వేలెత్తి చూపే అవకాశం కూడా దక్కనివ్వట్లేదు. ప్రతిపక్ష అభ్యర్థికి ప్లస్ రావాలంటే అధికార పక్ష ఎమ్మెల్యే వైపు ఏదైనా పొరపాట్లు ఉంటేనే కదా.. కానీ ఇటు తోపుదుర్తి జోరు.. అటు కేతిరెడ్డి హోరు..  చూస్తుంటే మాత్రం మళ్ళీ పరిటాల ఫ్యామిలీకి మళ్లీ  చుక్కెదురు అయ్యేట్టే ఉంది. రానున్న నాలుగేళ్లలో ఏదైనా జరిగి పరిస్థితులు మారితే తప్ప పరిటాల వారి చేతికి పగ్గాలు వచ్చేట్టు కనపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: