వీళ్లో చిత్ర‌మైన దొంగ‌లు. ఆషామాషీ దొంగ‌లు కాదు. కేవ‌లం పోలీస్ స్టేష‌న్‌లోనే దొంగ‌త‌నం చేయ‌డం వీరి స్పెషాలిటీ. ఇలాంటి ప్ర‌త్యేక‌మైన దొంగ‌త‌నాల‌కు హైద‌రాబాద్‌లోని పోలీస్ స్టేష‌న్ల‌ను ఎంచుకున్నారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను తస్కరించారు. కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బషరత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ (37) డై మేకర్‌గా పని చేస్తుండేవాడు. రోజువారిగా చేస్తున్న పనులతో వచ్చే సంపాదనతో ఇబ్బందులు పడుతున్న ఇమ్రాన్‌ పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలని ప్లాన్‌ వేశాడు. ద్విచక్ర వాహనాలను చోరీ చేసి విక్రయించాలని నిర్ణయించుకొని అమ‌లు చేశాడు. అయితే, అనుకోకుండా ఇక్క‌డ దొరికిపోవ‌డంతో ఈ ఇద్దరు నిందితులను కాలాపత్తర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ చిత్ర‌మైన దొంగ‌ల‌ను పోలీస్ ‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు.

 


ఇమ్రాన్ తన పథకాన్ని మిత్రుడు మహ్మద్‌ ఆదిల్‌కు వివరించి సహకరించాల్సిందిగా కోరాడు. ఆదిల్‌ సరే అనడంతో ఇమ్రాన్‌ నకిలీ తాళం చెవులతో పార్కింగ్‌ చేసిన వాహనాలను చోరీ చేయడం ప్రారంభించాడు. ఇద్దరు కలిసి కాలాపత్తర్‌ పోలీస్ ‌స్టేషన్‌ పరిధితో పాటు సైఫాబాద్‌, మైలార్‌దేవ్‌పల్లి, శాలిబండ, మంగళ్‌హాట్‌, ఫలక్‌నుమా, హుస్సేనీ ఆలం, ఆసిఫ్‌నగర్‌, కామాటిపుర పోలీస్ ‌స్టేషన్ల పరిధిలో 9 వాహనాలను తస్కరించారు. తాడ్‌బన్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇమ్రాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాల చిట్టాను బయటపెట్టాడు. పోలీస్ స్టేష‌న్ల‌లో ఎలా దొంగ‌త‌నాలు చేస్తున్న‌ది వెల్ల‌డించాడు. దీంతో షాక్ అవ‌డం పోలీసుల వంతు అయింది. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 6 లక్షల విలువైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌తోపాటు 5 హోండా యాక్టివా, 2 యమహా, ఓ హీరోహోండా స్లెండర్‌ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: