డ్రాగన్‌ మెల్లగా దారికొస్తోంది. సరిహద్దుల్లో ఆ దేశం ఉద్రికత్తలకు తెరితీస్తే.. భారత్‌ వాణిజ్య, భౌగోళిక రాజకీయ సమీకరణలతో చైనాకు జవాబిచ్చింది. ఆ ఫలితం మెల్లగా కనిపిస్తోంది. కీలకమైన పాంగాంగ్‌ సరస్సు వద్ద నుంచి కూడా చైనా బలగాలను వెనక్కి తీసుకొంటోంది. 

 

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే పాంగాంగ్ సరస్సులో మోహరించిన పడవల సంఖ్యను గణనీయంగా తగ్గించేసింది డ్రాగన్. మరోవైపు లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల చర్చలు కొనసాగుతున్నాయి.  పాంగాంగ్‌ , డిప్సాంగ్‌ ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకునే అంశంపై ఇరు పక్షాలు కసరత్తు చేస్తున్నాయి.  వాస్తవానికి ఈ సరస్సు వద్ద ఉన్న ఫింగర్‌ 4 నుంచి దళాలు వైదొలగడం అత్యంత కీలకం.

 

జూన్‌లో ఘర్షణ చోటు చేసుకొన్న పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 నుంచి ఇప్పటికే ఇరు బలగాలు రెండేసి కిలోమీటర్లు చొప్పున వెనక్కి తగ్గాయి. దీంతోపాటు గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతాల్లో వెనక్కి తగ్గుతున్నాయి.  వీటిపై గతవారం భారత ఎన్‌ఎస్‌ఏ , చైనా విదేశాంగశాఖ మంత్రి చర్చలు జరిపారు.  దీంతో పాంగాంగ్‌  సరస్సుపై పూర్తిగా దృష్టిపెట్టారు. 

 

ప్రస్తుతం సైనిక దళాలు వెనక్కి తీసుకొనే అంశంలో కొన్ని ప్రదేశాల్లో చైనాకు లాభం చేకూరుతోందని రక్షణరంగ విశ్లేషకులు పేర్కొన్నారు.  పెట్రోలింగ్‌ పాయింట్‌ 15, పెట్రోలింగ్‌ 17ఏ వద్ద ఈ ఒప్పందాలతో చైనాకు కొంత లబ్ధిచేకూరే వీలుందనే కథనాలు వస్తున్నాయి.

 

వాస్తవాధీన రేఖ దాటి చైనా భారత్‌లోకి ప్రవేశించింది. అవి వివాదాస్పదమైనప్పుడు చైనా ముందుకొచ్చిన మేరకు వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. కానీ, ఈ ఒప్పందాల్లో భారత్‌ కూడా వివాదాస్పద ప్రాంతం నుంచి కొంత వెనక్కి తగ్గడం ఇబ్బందికరంగా మారింది. చైనా వెనక్కి తగ్గినా.. అది వాస్తవాధీన రేఖ వద్దే ఉంటుంది.. భారత భూభాగంలో బఫర్‌ జోన్‌ను ఏర్పాటు చేస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: