కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం, ప్రజాసమస్యలు వీటిపై ప్రస్తుత తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉన్నా, అవన్నీ పక్కన పెట్టి రాజకీయాలు ముఖ్యం అన్నట్లుగా ఇప్పుడు కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ఇప్పటికే ఏపీలో అమరావతి ఉద్యమం పేరుతో పెద్ద రాద్ధాంతం నడుస్తోంది. టిడిపి బిజెపి, జనసేన పార్టీ ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి రాజకీయంగా తాము పట్టు సాధించాలనే విధంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నాయి. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని రాజధానిగా ఉంచే ప్రసక్తే లేదని, శాసన రాజధానిగా మాత్రమే ఉంటుందని, పరిపాలన రాజధానిగా విశాఖ ఉంటుందని, ఖరాఖండిగా చెప్పేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసినట్టుగా కనిపిస్తోంది.

 

 అమరావతిలో అయోధ్య తరహాలో రామాలయం నిర్వహిస్తామంటూ ప్రకటన వెలువడింది. అలా ప్రకటన వెలువడిందో లేదో వెంటనే వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లక్ష రూపాయలు, బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పదిలక్షలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఒకపక్క అమరావతిలో రాజధాని ఉంచాలంటూ 200 రోజులకు పైగా పెద్ద ఉద్యమమే చేశారు. అయినా, ఆశించినంత ఫలితం రాకపోగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు సిద్ధపడటండంతో, అకస్మాత్తుగా హిందూ మహాసభ ప్రతినిధి చక్రపాణి మహరాజ్ అమరావతి ప్రాంతంలో రామాలయ నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్టు ప్రకటన చేశారు. 


అయోధ్య తరహాలోనే ఇక్కడ రామాలయం నిర్మిస్తామని చెప్పారు. ఈ వ్యవహారంతో అసలు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతోంది అనే  అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది. అకస్మాత్తుగా హిందూ మహాసభ ఎందుకు అమరావతిపై  ప్రకటన చేసింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా, బీజేపీ ఈ తరహా ఎత్తుగడలకు వేసి ప్రజల్లో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: