ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జూన్ నెలతో పోలిస్తే జులైలో రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. అన్ లాక్ 2.0 సడలింపుల తరువాత తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కేసుల సంఖ్య పెరగడానికి కారణాలేమిటనే ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కరోనా లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. డాక్టర్లు కొందరు రోగులకు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్న రోగులు హోం ఐసోలేషన్ లోనే ఉండిపోతున్నారు. పరీక్షలు చేయించుకున్న తరువాత వైరస్ నిర్ధారణ అయితే అపార్ట్‌మెంట్‌వాసుల నుంచి, తెలిసిన వాళ్ల నుంచి ఎటువంటి వేధింపులు వస్తాయోనని కొందరు పరీక్షలు చేయించుకోవడానికే ఆసక్తి చూపట్లేదు. 
 
లక్షణాలను బట్టి 14 రోజులు ఇంట్లోనే ఉంటూ తెలిసిన మందులు వాడుతూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు లాంటి లక్షణాలు కనిపించినా కొందరు హోం ఐసోలేషన్ కే పరిమితమవుతూ ఉండటం గమనార్హం. మరికొందరిలో నమూనాలు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో వైరస్ సోకుతుందనే భయం ఉంది. వైరస్ నిర్ధారణ అయితే సామాజిక బహిష్కరణకు గురి అవుతున్నట్లు ఉందని కొందరు కరోనా నిర్ధారణ అయిన రోగులు చెబుతున్నారు. 
 
మరికొంతమంది వైరస్ సోకినా ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొందరు లక్షణాలు కనిపించినా జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే ఇలా లక్షణాలు ఉండి పరీక్షలు చేయించుకోని వారి వల్లే తెలుగు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుందనే ప్రచారం జరుగుతోంది. లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఏపీ, తెలంగాణలో లక్షణాలు కనిపించినా పరీక్షలు చేయించుకోని వారి సంఖ్య భారీగానే ఉందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి వీళ్లే కారణమవుతున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: