గడిచిన 4 నెలలుగా కరోనా వల్ల దేశంలోని ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలు రోడ్లపైకి వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అయితే పలు వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్స్ లో విజయవంతమవుతూ అతి త్వరలో కరోనాను జయించగలమనే నమ్మకాన్ని, విశ్వసాన్ని పెంచుతున్నాయి. మరికొన్ని నెలల్లో ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఐతే కచ్చితంగా ఉన్నాయి. గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ మంచి ఫలితాలు సాధిస్తోందని తెలిపింది. 
 
తాజాగా రష్యాలో కరోనా వ్యాక్సిన్ అన్ని దశల క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంది. రష్యాలోని సెచెనోవ్‌ మెడికల్‌ యూనివర్సిటీ చేసిన కరోనా వ్యాక్సిన్ వైరస్ ను నియంత్రించడంలో మంచి ఫలితాలు సాధించినట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌లేషన్‌ మెడిసిన్‌ అండ్‌ బయోటెక్నాలజీ డైరెక్టర్‌ వాదిమ్‌ తారాసోవ్ కీలక ప్రకటన చేశారు. గత నెల 18వ తేదీన క్లినికల్‌ ట్రయల్స్ ప్రారంభం కాగా మొదటి బృందాన్ని బుధవారం డిశ్చార్జ్ చేశారు. 
 
రెండో బృందాన్ని ఈ నెల 20వ తేదీన డిశ్చార్జ్‌ చేయనున్నట్టు తారాసోవ్ తెలిపారు. సెచెనోవ్‌ యూనివర్సిటీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. రష్యా యూనివర్సిటీ అన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడంతో మరికొన్ని నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: