మంత్రి వర్గ విస్తరణపైన ఎమ్మెల్యేలు కోటి ఆశలు పెంచుకుంటున్నారు. జగన్ చల్లని చూపు ఉంటే చాలు తాము మంత్రులం అయిపోవచ్చు అని వారు గట్టిగా భావిస్తున్నారు. అయితే మంత్రి కుర్చీలు అక్కడ రెండు మాత్రమే ఖాళీగా కనిపిస్తున్నాయి. జగన్ తలచుకోవాలే కానీ కనీసం అరడజన్ సీట్లు లేచిపోవా అని ఆశావహులు నమ్మకంగా ఉన్నారు.

 

అయితే జగన్ మాత్రం తేనె తుట్టెను కదపదలచుకోలేదు అంటున్నారు. అసలే కరోనా మహమ్మారి ఓ వైపు ఉంది. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకో వైపు లోకల్ బాడీ ఎన్నికలు జరగలేదు. అధికారంలోకి వచ్చి ఏడాదే అయింది. హామీలు తీర్చినా ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఈ నేపధ్యంలో తొలి ఏడాదికే కొంతమందిని ఇంటికి పంపిస్తే కొత్త చిక్కులు రాజకీయంగా వస్తాయని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు.

 

దాంతో ఏవైతే రెండు సీట్లు ఖాళీ అయ్యాయో వాటి వరకే భర్తీని పరిమితం చేస్తే సులువుగా ఉంటుందని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ నెల 22, 24ల్లో గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. దాంతో ఇద్దరు మంత్రులతో సింపుల్ గా ప్రమాణం కార్యక్రమం ఆ తేదీల్లో ఉంటుందని అంటున్నారు.

 

ఇదిలా ఉండగా జగన్ మదిలో ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అన్నది పక్కాగా ఉందని తెలుస్తోంది. రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గాలతోనే భర్తీ చేస్తే ఎటువంటి  తలకాయ నొప్పీ ఉండదని జగన్ భావిస్తున్నారుట. అదే విధంగా వారు ప్రాతినిధ్యం వహించిన జిల్లాలకే ఆ పదవులు  ఇస్తే మరింత ఈజీగా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారుట. ఇక ఆ ఇద్దరూ ఎవరా అన్నదే ఇపుడు అతి పెద్ద సస్పెన్స్. దానికి తెర పడాలంటే మంత్రివర్గ విస్తర‌ణ తేదీ వరకూ వేచి చూడడమే సబబు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: