ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధికారులు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. తాజాగా రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలలో నేటి నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు కానుంది. గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాజమండ్రి, కాకినాడతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో సైతం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. 
 
దీంతో అధికారులు నేటి నుంచి కాకినాడలో లాక్ డౌన్ అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరవడానికి అనుమతించనున్నారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు, మెడికల్ షాపులకు మాత్రమే తెరవడానికి అనుమతులు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయం 11 గంటల వరకు మాత్రమే రోడ్లపైకి జనాలు వచ్చేందుకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. 
 
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా భీమవరంలో నేటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 వరకు మాత్రమే అనుమతిస్తామని చెబుతున్నారు. అధికారులు నగరంలో అన్నివైపులా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నగరంలో కూరగాయలు, చేపల మార్కెట్‌లను కూడా మూసివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.  మరోవైపు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1933 మందికి కరోనా నిర్ధారణ కాగా 19 మంది మృతి చెందారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయందోళనకు గురి చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: