జర్నలిస్టు నవీన్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ తీన్మార్ మల్లన్న అంటే మాత్రం ఈజీగా గుర్తు పట్టేస్తారు. మొదట్లో వీ6లో తీన్మార్ వార్తలు చదువుతూ  మల్లన్న పాత్ర ద్వారా పేరు తెచ్చుకున్నాడీ నవీన్. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. కానీ ఫలితం దక్కలేదు. 

 


ఆ తర్వాత మళ్లీ టీవీ5లో ప్రస్తుతం మాస్ మల్లన్నగా వార్తలు చదువుతూ అలరిస్తున్నాడు. ఈ ఛానల్‌లో ఇదో టాప్ రేటింగ్ ప్రోగ్రామ్. ఇదే సమయంలో క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్నాడు మాస్ మల్లన్న. ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. తరచూ కేసీఆర్ సర్కారు అక్రమాలు చేస్తోందంటూ అనేక వీడియోలు రూపొందించాడీ మల్లన్న. 

 


తాజాగా ఈ  సీనియర్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. తన ఛానెల్ చేసిన ఓ ఆరోపణపై వివరణ ఇచ్చేందుకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు చేశారు తీన్మార్ మల్లన్న. దీనిపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో మల్లన్నపై కేసు ఫైల్ అయింది. దీనికి వివరణ ఇచ్చేందుకు ఆర్మూర్ వెళ్తుండగా ఈ ఎటాక్ జరిగింది.

 

 

టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయబోతున్నారని ముందే సమాచారం అందుకున్న మల్లన్న  తన ప్రయాణాన్ని, టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని యూట్యూబ్ , ఫేస్ బుక్ లలో లైవ్ ప్రసారం చేశారు. లక్షలాది మంది ఈ దాడిని లైవ్ లో చూశారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఓ ఎస్సైకి కరోనా పాజిటివ్ రావడంతో.. స్టేషన్ ను శానిటైజ్ చేశారు. అందుకే తీన్మార్ మల్లన్నను మధ్యలోనే మరో పోలీస్ స్టేషన్ లో విచారణ చేసి.. తిరిగి హైదరాబాద్ పంపించేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: