తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. భారీగా కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకం మొత్తం భయాందోళన లోనే బతుకుతుంది. అయితే ఇప్పటికి కూడా కొంతమంది అవగాహన లేమితో కరోనా  అంటే తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు . సీజనల్ వ్యాధులు వచ్చినప్పటికీ కరోనా సోకిందేమో అనే భయంతో వణికిపోతున్నారు. ఇలా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్న నేపథ్యంలో కరోనా  ఏదో.. సీజనల్ వ్యాధి ఏదో గుర్తించలేకపోతున్నారు, చివరికి కొంతమంది మనస్తాపం చెంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఓ విషాదకర ఘటన జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కరోనా  వైరస్ లక్షణాలతో బాధపడుతున్న ఓ యువకుడు మానసికంగా కుంగిపోయి ఎవ్వరికీ చెప్పుకోలేక తనలో తానే సతమతమైపోయి.. ఏకంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు.



 హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లో నిన్న రాత్రి జరిగింది ఈ విషాద ఘటన. వివరాల్లోకి వెళితే... సంతోష్ నగర్ లోని ఖలందర్ నగర్ లో  నివాసముంటున్న సయ్యద్ సాదిక్ అలీ అనే యువకుడు కోవిడ్ 19  కాల్ సెంటర్ లో పని చేస్తున్నాడు, అయితే గత కొంతకాలంగా జ్వరం దగ్గు తో బాధపడుతున్నాడు సాదిక్ అలీ. ఈ క్రమంలోనే చికిత్స కోసం క్లినిక్  వెళితే కరోణ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని అక్కడ సిబ్బంది సూచించారు. కరోనా  వైరస్ లక్షణాలు కనిపించడంతో అప్పటికే తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు.. క్లినిక్  వెళ్ళిన పరీక్షలు చేయించుకోవాలని చెబుతుండడంతో మరింత కుంగిపోయాడు. దీంతో తనకి కరోనా సోకిందేమో అని తీవ్ర ఆందోళన చెందాడు.



 ఇక ఈ జీవితం వృధా అనుకొని క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని  ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎవరూ లేని సమయంలో గదిలో  ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: