ఆ తండ్రి ఎంతో కష్టపడి తన కొడుకు కోసం కొన్ని డబ్బులు పోగు చేశాడు. ఎన్నో ఏళ్ళు కష్టపడి కొంత మొత్తాన్ని వెనకేసుకున్నాడు, కానీ కొడుకు చేసిన చిన్న పొరపాటు ఆ తండ్రి సంపదను ఆవిరి చేసింది. ఆ కుటుంబం ఆర్థిక దోపిడీకి గురై ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలకు ఆన్లైన్ గేమ్ పేరుతో అట్రాక్ట్ చేసి... భారీగా డబ్బులను అకౌంట్ నుంచి కాలి  చేస్తున్నా సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ బాలుడు తన తల్లి స్మార్ట్ ఫోన్ నుంచి ఆన్లైన్ గేమ్ లోకి వెళ్లగా ఏకంగా ఐదు లక్షలకు పైగా నగదు ఖాతా నుంచి ఖాళీ అయ్యింది. ఈ ఘటన అమలాపురం లో చోటుచేసుకుంది. 

 

 అమలాపురం స్థానిక గణపతి థియేటర్ సమీపంలో ఉండే తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు 20 రోజుల నుంచి ఆన్లైన్లో గేమ్ ఆడుతున్నాడు. ఫ్రీ ఫైర్ అనే ఆన్లైన్ గేమ్ యాప్ ని ఓపెన్ చేసాడు సదరు బాలుడు. ఇక ఈ గేమ్ లో భాగంగా కొత్త వెపెన్స్  కొనాలి అంటే లింక్ ఓపెన్ చేయాలి అంటూ ఒక ఆప్షన్ వచ్చింది. అప్పటికే గేమ్ లో నిమగ్నమైన బాలుడు ఆ లింకును ఓపెన్ చేశాడు. ఇందులో వంద నుంచి వెయ్యి వరకు వెపన్స్ ధరలు ఉన్నాయి. ఇక వాటిని కొనుగోలు చేయాలనుకుని ఓటీపీ  కూడా ఎంటర్  చేశాడు. ఇలా 1000 నుండి  5000 నుండి 10000  రూపాయల వెఫెన్స్ కొనుగోలు చేయడం ప్రారంభించాడు సదరు బాలుడు. దీంతో 20 రోజుల వ్యవధిలోనే 5.40 లక్షల నగదు ఖాతా నుంచి ఆవిరైపోయింది. 

 

 ఈ క్రమంలోనే తల్లి ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేద్దామనుకుంటే డబ్బులు రాలేదు ఏంటా  అని.. అకౌంట్ బాలన్స్ చెక్ చేయగా... తన ఖాతాలో ఉన్న డబ్బులు చూసి అవాక్కయింది ఆ తల్లి. తర్వాత తనకు ఖాతాలు ఉన్న రెండు బ్యాంకులకు వెళ్లి ఆరా తీయగా... అకౌంట్ నుంచి డబ్బులు అన్ని క్రమక్రమంగా డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి దాచుకున్న  కష్టార్జితం మొత్తం ఆవిరైపోవటంతో  తల్లడిల్లిపోయిన  తల్లి పోలీసులను ఆశ్రయించింది. కువైట్ లో పనిచేస్తున్న తన భర్త కష్టపడి తన అకౌంట్లో డబ్బులు వేస్తే  ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల బారినపడి ఆ డబ్బులు మొత్తం పోయాయి అంటూ ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: