దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో శానిటైజర్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. కరోనా సోకకుండా మనలో చాలామంది రోజులో ఎక్కువసార్లు శానిటైజర్లను వినియోగిస్తున్నారు. వైద్యులు, నిపుణులు వైరస్ బారిన పడకుండా శానిటైజర్లను వినియోగించాలని సూచిస్తున్నారు. అయితే శానిటైజర్లను ఎక్కువగా వినియోగించడం మంచిది కాదని... అవసరమైతేనే శానిటైజర్లు వాడాలని కొందరు వైద్యులు చెబుతున్నారు. 
 
డాక్టర్‌ సిహెచ్‌. సురేంద్రనాథ్‌ ప్రజలు శానిటైజర్లను వినియోగించటం కంటే సబ్బులను వినియోగించటం మేలని సూచిస్తున్నారు. సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడానికి వీలు కాని సమయంలో మాత్రమే శానిటైజర్లను వినియోగించాలని చెబుతున్నారు. ఆహారం తినే ముందు శానిటైజర్లను వాడకపోవడమే ఉత్తమమని... లేకపోతే అందులో ఉండే ఆల్కహాల్ కడుపులో చేరే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. 
 
శానిటైజర్ లో ఉండే ఆల్కహాల్ శరీరంలో చేరితే వాంతులు, విరోచనాల బారిన పడొచ్చు. ఆల్కహాల్ శరీరంలోకి వెళితే మంచి చేసే బ్యాక్టీరియాను సైతం చంపేస్తుంది. శానిటైజర్లను ఎక్కువగా వాడితే చర్మం పొడిబారుతుంది. చర్మం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడానికి మాయిశ్చరైజర్లను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కెమికల్స్ తో రోజంతా పని చేసే వాళ్లు శానిటైజర్లను వినియోగించకపోవడమే మంచిది. 


కెమికల్స్ తో పని చేసే వాళ్లు శానిటైజర్లను వాడితే శరీరానికి హానికరం. మరోవైపు మార్కెట్లో కల్తీ శానిటైజర్లు దర్శనమిస్తున్నాయి. కల్తీ శానిటైజర్లను వాడితే శరీరానికి మరింత ప్రమాదకరం. అందువల్ల శానిటైజర్లను కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసే సమయంలో, బయట ప్రదేశాల్లో ఉన్న సమయంలో చేతులను శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లను వినియోగించడం ఉత్తమం. నిజానికి శానిటైజర్లు అన్ని రకాల వైరస్ లను చంపవు. కానీ కరోనా వైరస్ ను చంపడంలో శానిటైజర్లు మంచి ప్రభావం చూపిస్తాయని వైద్యులు చెప్పడంతో వీటికి ప్రాధాన్యత పెరుగుతోంది. సబ్బు కూడా శానిటైజర్ తరహాలో పని చేస్తూ ఉండటంతో వైద్యులు సబ్బును వినియోగించటమే మేలని చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: