ప్రపంచ దేశాలు కరోనా వైరస్ ధాటికి గజగజా వణుకుతున్నాయి. ప్రజలంతా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని చెబుతున్నారు. ప్రజలు వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా....? అనే ప్రశ్నకు ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టమేనన్న సమాధానం వినిపిస్తోంది. ఫ్రాన్స్ కు చెందిన నిపుణుడు ఒకరు 2021 చివరినాటికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టమేనని చెబుతున్నారు. 
 
మరో వైద్యుడు అర్నాడ్ ఫోంటానెట్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకకుండా పాటించాల్సిన నియమాలను ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఒక వ్యాక్సిన్ ను తయారు చేయాలంటే చాలా సంవత్సరాలు పడుతుందని.... అది అంత సులభమైన ప్రక్రియ కాదని.... 2021 చివరినాటికి కరోనాపై సమర్థవంతంగా పోరాడే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందంటే అది ఆశ్చర్యకరమేనని వ్యాఖ్యలు చేశారు. 
 
వచ్చే ఏడాదిలోపు కరోనాపై పాక్షికంగా పని చేసే టీకా ఐతే రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం అంతానికి మనం చాలా దూరంలోనే ఉన్నామని వ్యాఖ్యలు చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని... మరోసారి లాక్ డౌన్ అమలు చేసినా కష్టమేనని పేర్కొన్నారు. సామాజిక కార్యక్రమాలు, విందులు, వినోదాలు, జనసందోహ కార్యక్రమాలకు మరికొంతకాలం దూరంగా ఉండాల్సిందేనని తెలిపారు. 
 
ప్రజలు గుమికూడే ప్రాంతాలే వైరస్ విసృతంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రార్థనా మందిరాలు, పునరావాస కేంద్రాలు, డిస్కోలు, క్రీడా ప్రాంగణాల ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 28,701 కరోనా కేసులు నమోదు కాగా 500 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు.                    

మరింత సమాచారం తెలుసుకోండి: