ఎన్నో ఏళ్ల నుంచి కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్లు కావాలంటూ, కాపులని బీసీల్లో చేర్చాలని ఉద్యమాలు చేస్తున్న ముద్రగడ పద్మనాభం హఠాత్తుగా కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సొంత సామాజికవర్గం వారే తనపై సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారని, కొందరు వెనుక ఉండి ఈ కథని నడిపిస్తున్నారని ముద్రగడ మనస్తాపానికి గురై, కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నారు.

 

హఠాత్తుగా ముద్రగడ ఉద్యమం నుంచి తప్పుకోవడంపై టీడీపీ కాపు నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు. ఉద్యమం నుంచి ముద్రగడ తప్పు కోవటం సరికాదని, నాయకత్వం వహించే వారిపై విమర్శలు సహజమేనని, ముద్రగడపై సోషల్ మీడియా విమర్శలు చేసేది వైఎస్సార్‌సీపీ వాళ్లేనని అన్నారు. ఇక గత టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని, కాపు జాతి కోసం ముద్రగడ ముందుకు రావాలని, త్వరలో 13 జిల్లాల కాపు నాయకులతో సమావేశం పెడతానని బోండా చెప్పారు.

 

అయితే గత ఐదేళ్లు కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన ముద్రగడని టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా ముద్రగడపై విమర్శలు చేశారు. ఇప్పటికీ వారు అదే పనిలో ఉన్నారు. ముద్రగడ, జగన్ ఆధ్వర్యంలో నడుస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఇక తాజాగా ముద్రగడ...రిజర్వేషన్లు కోసం జగన్‌కు లేఖ రాశారు. అలా లేఖ రాసిన కొన్ని రోజుల్లోనే ముద్రగడ ఉద్యమం నుంచి తప్పుకోవాలనుకోవడం జరిగిపోయాయి.

 

ఇక ఇదే అంశాన్ని ఉపయోగించుకుని జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో, చంద్రబాబు నడుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే బోండా ఉమాని లైన్‌లోకి తీసుకొచ్చి, కాపులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి ఈ ‘కాపు’ రాజకీయం ఎంతవరకు వెళుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: