ఆగస్ట్ లో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ... అన్ని జాగ్రత్తలు తీసుకుని సెషన్స్‌ నిర్వహించాలని భావిస్తోంది. యథావిథిగానే సభల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండటంతో... వర్చువల్‌ సమావేశాలు జరుగుతాయన్న ప్రచారానికి తెరపడింది.

 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను వచ్చే నెలలోనే నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా... అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తామని కేంద్ర పార‍్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు.

 

ఎప్పట్లాగే వర్షాకాల సమావేశాలు యథావిధిగానే జరగనున్నాయి. అంటే ఎంపీలంతా ఉభయ సభలకు నేరుగా హాజరవుతారు. వర్చువల్‌ సెషన్స్‌ లాంటివి ఏమీ ఉండవు. సభ్యులు వ్యక్తిగత దూరం పాటిస్తూ కూర్చునేలా... సీటింగ్‌లో మార్పులు చేస్తున్నారు. లాబీలు, గ్యాలరీలు, సెంట్రల్‌ హాల్‌, బాలయోగి ఆడిటోరియంలోనూ ఎంపీలు కూర్చునేందుకు వీలున్న అవకాశాలను ఇప్పటికే పరిశీలించారు. 

 

ఈ ఏడాది మార్చిలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌ 12 బిల్లులను ఆమోదించింది. ఆ సెషన్స్‌లో రెండు సభల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టారు. ఫైనాన్స్‌ బిల్లుతో పాటు బడ్జెట్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం... కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనతో ఇరు సభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి.

 

రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆరు నెలలకు మించకూడదన్న నిబంధన ప్రకారం... సెప్టెంబరు 22కు ముందే ఉభయ సభలు ప్రారంభం కావాల్సి ఉండటంతో... ఆగస్టులోనే వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.

 

మొత్తానికి  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ సభలో సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. సభలు ఎలా నిర్వహించాలనే దానిపై పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలనే దానిపై తమ పార్టీ సభ్యులను సిద్ధం చేస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: