ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా ఈ రోజు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రాజెక్ట్‌లు ఇప్పుడిప్పుడే జలకళను సంతరించకుంటున్నాయి. 

 

నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే చేరుకొని, దేశమంతటా విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు, రేపు అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనుండగా.. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది. 

 

ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

 

మరోవైపు కృష్ణా, గోదావరి నదులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువన కర్ణాటకలోని ప్రాజెక్టుల్లో నీరు పెరుగుతుండటంతో... ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ గలగలలు మొదలయ్యాయి. అటు తుంగభద్రలోనూ నీటి ప్రవాహం పెరగడంతో.. జూరాలలో ప్రాజెక్టు జలకళను సంతరించుంది. దీంతో జూరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని దిగువకు విడుదల చేసింది. 

 

అటు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో బ్యారేజీ జలకళను సంతరించుకుంది. మున్నేరు వాగు నుంచి 14 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అయితే ఇప్పటికే 4వేల 500 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఏడు గేట్లు ఎత్తి నీటి విడుదల చేశారు. 

 

గోదావరిలోనూ వరద ప్రవాహం పెరిగింది. తెలంగాణలో వరద తక్కువగానే ఉన్నప్పటికీ, ధవళేశ్వరం వద్ద వరద పెరిగింది. దీంతో సముద్రంలోకి  నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవారం రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. 

 

మొత్తానికి ఈసారి వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో.. ప్రాజెక్టుల్లో వరద పెరిగింది. ఓ వైపు వర్ష సూచన.. మరోవైపు నదుల్లో ప్రవాహం పెరుగుతుండడంతో సాగు ఊపందుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: