ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో జరిపిన చర్చలు.. సత్ఫలితాన్నిచ్చాయి. దేశీయ సంస్కరణలకు ఊతమిచ్చేలా... గూగుల్‌ సంస్థ డిజిల్‌ ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పిచాయ్‌ ప్రకటించారు.

 

కరోనా కల్లోలంలో భారత్‌కు భారీ ఊరట లభించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాలు.. వృథా కాలేదు. డిజిటల్‌ ఇండియాలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆయన.. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో వర్చువల్‌ భేటీలో పాల్గొన్న కొద్ది వ్యవధిలోనే.. గుడ్‌ న్యూస్‌ వచ్చింది. భారత స్టార్టప్స్‌ రంగంలో సుమారు 75 వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్టనున్నట్టు గూగుల్‌ సంస్థ ప్రకటించింది.

 

ఈ విషయాన్ని సుందర్‌ పిచాయ్‌... గూగుల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారీ పెట్టుబ‌డులు పెట్టనున్నట్టు ప్రకటించారు.  ప‌ది బిలియ‌న్ల డాల‌ర్ల నిధుల‌తో భార‌తీయ డిజిట‌ల్ ఆర్థిక వ్యవస్థ బ‌లోపేతం కానున్నట్టు సుంద‌ర్ పిచాయ్ తెలిపారు. ప్రధాని న‌రేంద్ర మోదీ చేప‌ట్టిన డిజిట‌ల్ ఇండియా కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం  గ‌ర్వంగా ఉందని.. పిచాయ్‌ ఆనందం వ్యక్తం చేశారు. డిజిట‌ల్ ఇండియా విజ‌న్‌తో ప్రధాని మోదీ ప‌నిచేస్తున్న ప్రయత్నం పట్ల ఆయ‌న హ‌ర్షం వ్యక్తం చేశారు.  

 

అయితే, అంతకు ముందే.. ప్రధాని మోడీ కూడా సుందర్‌ పిచాయ్‌తో చర్చల సారాంశాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుంద‌ర్ పిచాయ్‌తో అర్థవంత‌మైన చర్చల్లో పాల్గొన్నట్టు తెలిపారు. వివిధ అంశాల‌పై పిచాయ్‌తో మాట్లాడానని..  ప్రధానంగా భార‌తీయ రైతులు, యువ‌త‌, పారిశ్రామికవేత్తలను మార్చడంలో టెక్నాలజీ పోషించే పాత్ర  గురించి చర్చించినట్టు తెలిపారు. సుందర్‌ పిచాయ్‌ కూడా తనకు సమయం కేటాయించిన ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డిజిటల్‌ ఇండియా పట్ల ప్రధాని మోడీ విధానాల్ని ప్రశంసించారు. ఆ తర్వాత భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించారు. 

 

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించేందుకు..  గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. . ఇండియాలో కరోనా వైరస్ వల్ల తలెత్తిన పరిస్థితిని, దేశ ఎకానమీ ఎదుర్కొంటున్న సమస్యను పిచాయ్‌ దగ్గర ప్రస్తావించారు. ఈ తరుణంలో భారత ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు సహకరించాలని ప్రధాని కోరినట్టు తెలిసింది. ఎఫ్ డీ ల సేకరణకు తాము వ్యతిరేకం కాదని మోడీ చెప్పడంతో.. అందుకు సుందర్ పిచాయ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తాము అన్ని అంతర్జాతీయ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ అనే నినాదమిచ్చినంత మాత్రాన.. విదేశీ ఇన్వెస్టర్లకు తలుపులు మూసినట్టు కాదని కూడా తెలిపారు. 

 

మొత్తానికి.. ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వర్చువల్ భేటీ సక్సెస్‌ అయ్యింది. కరోనా కల్లోలంలో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా.. దాదాపు 75వేల కోట్లు ఇండియన్‌ స్టార్టప్స్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్‌ ముందుకొచ్చింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ డీలాపడకుండా ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: