కేరళలో ప్రకంపనలు సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది ఎన్‌ఐఏ. ప్రధాన నిందితులు స్వప్నసురేశ్, సందీప్‌లకు కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా తేలడంతో.. వీరిని పది రోజుల కస్టడీలోకి తీసుకోనుంది. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో తెలుసుకునేందుకు.. పలుకోణాలో విచారించనుంది.

 

తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌.. ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ స్కాన్‌లో ఉంది. కేరళ్‌ గోల్డ్‌ స్కామ్‌లో ఇప్పటికే ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.. కాన్సులేట్‌ లో పనిచేసేవారి సైతం దీనిలో భాగమై ఉండొచ్చని భావిస్తోంది. నిందితుల్లో ఒకరైన స్వప్నసురేశ్‌.. యూఏఈ కాన్సులేట్‌ మాజీ ఉద్యోగి. అందుకే అటు నుంచి నరుక్కొస్తే.. మరిన్ని విషయాలు బయటపడతాయనేది  ఆలోచనగా తెలుస్తోంది.

 

కరోనా పరీక్షల్లో నిందితులిద్దరికీ నెగెటివ్‌ అని తేలడంతో.. రేపటి నుంచి పది రోజుల వీరిని విచారించనుంది ఎన్ఐఏ బృందం. ఈ కేసులో A3 గా ఉన్న ఫజిల్‌ స్టేట్‌మెంట్‌ను ఫోన్‌ ద్వారా రికార్డు చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఫజిల్‌ను.. అతని ఫ్రెండ్‌ ద్వారా కాంటాక్ట్‌ చేసిన ఎన్ఐఏ.. కీలక విషయాల్ని సేకరించింది. యూఏఈ కాన్పులేట్‌ ఎవరో ఒకరు సహాయం అందించకపోతే.. ఇంత పెద్ద గోల్డ్‌ స్కామ్‌ వెలుగు చూసే అవకాశం లేదని ఎన్ఐఏ నిర్ధారించింది.

 

అయితే ఇలా బంగారం అక్రమంగా రవాణా చేయడం ఇదే తొలిసారి కాదని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.నిందితురాలు స్వప్న ఇటీవల చాలాసార్లు ఇలాంటి బ్యగేజ్‌లను కలెక్ట్‌ చేసుకున్నట్టు గుర్తించారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నలుగురు నిందితుల్లో ముగ్గురు.. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారిలో ఇద్దరు యూఏఈ మాజీ ఉద్యోగులే. స్వప్నతో పాటు పీఎస్‌ సరిత కూడా కాన్సులేట్‌లో పీఆర్‌ఓగా పనిచేసింది.

 

ఈ గోల్డ్‌ స్కామ్‌... ఇండియాలో టెర్రర్‌ ఫండింగ్‌ కోసమేనని ప్రాథమిక విచారణలో తేల్చింది ఎన్ఐఏ. వ్యాపారి సందీప్‌.. ఇందులో కీలక సూత్ర దారి కాగా... మొదట మాత్రం కాన్సులేట్‌లో పీఆర్‌ఓగా పనిచేస్తున్న సరిత అరెస్టైంది. జూలై 5న కొచ్చిలో కస్టమ్స్‌ అధికారులు ఆమెను పట్టుకున్నారు. అయితే, ఈ స్కామ్‌లో గోల్డ్‌ సప్లయర్‌ను‌.. ఎర్నాకులం వాసి ఫజిల్‌ ఫరీద్‌గా గుర్తించింది దర్యాప్తు బృందం. 

 

జూలై 5న త్రివేండ్రం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో.. దాదాపు 15కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు సీజ్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పట్టుకున్న ఎన్ఐఏ.. దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. స్కామ్‌తో లింకున్న వారికోసం కూపీ లాగుతోంది. ప్రధాన నిందితులు స్వప్న సురేశ్‌, సందీప్‌ల నుంచి పదిరోజుల కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: