2019 ఎన్నికల్లో ఎంత జగన్ సునామీ ఉన్నా కూడా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ విజయం అడ్డులేకపోయిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా 2014 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతోనే 2019 ఎన్నికల్లో బాలయ్య గెలిచారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని, అభిమానులని కొడతారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రచారం చేసినా సరే బాలయ్య గెలుపు ఆగలేదు.

 

ఇక రెండోసారి గెలిచిన బాలయ్య..హిందూపురం వెళ్ళేది తక్కువైన సరే, స్థానిక టీడీపీ నేతల ద్వారా, పి‌ఏ ద్వారా పనులు చేయిస్తున్నారు. అవసరమైతే అధికారులకు ఫోన్లు చేసి పనులు అయ్యేలా చేసుకుంటారు. అయితే గత ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి బాలయ్యకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంది. అయినా సరే బాలయ్య తన హిందూపురం అభివృద్ధి కోసం ప్రత్యర్ధి పార్టీ నేతలతో సైతం మాట్లాడుతూ, పనులు చేయించుకోవడానికి చూస్తున్నారు.

 

ఇప్పటికే నగరి ఎమ్మెల్యే, ఏ‌పి‌ఐ‌ఐ‌సి ఛైర్మన్ రోజాతో బాలయ్య హిందూపురం పారిశ్రామికవాడ గురించి మాట్లాడారు. రోజా కూడా బాలయ్య మాటకు విలువ ఇస్తూ, పారిశ్రామికవాడ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే తాజాగా బాలయ్య... సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్నీ, వైద్యా, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిలకు విడివిడిగా లేఖలు రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని కోరారు. అలాగే హిందూపురం నియోజకవర్గం మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని, మాల్గురులో అందుకు సరిపడా భూమి అందుబాటులో ఉందని లేఖలో పేర్కొన్నారు.

 

అయితే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన జరుగుతుందని అంటున్నారు కాబట్టి, హిందూపురం పార్లమెంట్జిల్లా కావడం ఖాయం. కానీ వైద్య కళాశాలని హిందూపురం పక్కనే ఉండే పెనుగొండకు తరలించుకెళ్లాలని మంత్రి శంకర్ నారాయణ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై బాలయ్య కూడా హిందూపురంలోని వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడారు. ఎలాగైనా వైద్య కళాశాల హిందూపురంలో ఏర్పాటు చేసేలాగా సీఎంని కోరతానని చెప్పారు. ఇక చెప్పినట్లుగానే బాలయ్య ఇప్పుడు జగన్‌కు లేఖ రాశారు. మరి బాలయ్య కోరిన విధంగా జగన్ హిందూపురంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: