వలసలు ఎప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగానే ఉంటాయి. ఎప్పుడైతే ప్రతిపక్షాల నుంచి నాయకులు వస్తారో...అప్పటి నుంచి అధికార పార్టీలో ఆధిపత్య పోరు మొదలవుతుంది. ఈ ఆధిపత్య పోరులో ఎవరోకరికి చెక్ పడిపోవడం జరిగిపోతుంది. అయితే గతంలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా, వైఎస్సార్‌సీపీ నాయకులని తీసుకుని నానా ఇబ్బందులు పడింది. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం కుదరకు చివరికి పార్టీకే పెద్ద బొక్క పడింది.

 

అయితే అలాంటి నష్టమేమీ జరగకుండా ఇప్పుడు జగన్ వలసలని ప్రోత్సహిస్తున్నారు. సొంత పార్టీ వాళ్ళకు నష్టం జరగకుండా, టీడీపీ నేతలని చేర్చుకుంటున్నారు. కాకపోతే ఈ వలసల కార్యక్రమం అన్నిచోట్లా సక్సెస్ అయినట్లు కనబడటం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు ఉన్నట్లు తెలుస్తోంది. అలా అధికార పార్టీలో ఆధిపత్య పోరు నడిచే నియోజకవర్గాల్లో దర్శి కూడా ఉంది.

 

దర్శిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకే పెద్దగా పొసగడం లేదు. అసలు 2019 ఎన్నికల్లో బూచేపల్లి పోటీ చేయాలి. కానీ ఆర్ధిక పరిస్థితుల ఆయన పక్కకు తప్పుకోవడంతో మద్దిశెట్టి సీటు దక్కించుకుని విజయం సాధించారు. అయితే మద్దిశెట్టి గెలిచాక, బూచేపల్లి ఆలోచన మారింది. పోటీ చేసి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ లో ఆయన ఉన్నారు.

 

సరే నెక్స్ట్ అయిన సీటు దక్కించుకుందామనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే నియోజకవర్గంపై పట్టు తెచ్చుకోవడానికి చూస్తున్నారు. అందుకే ప్రస్తుతం నియోజకవర్గంలో బూచేపల్లి పెత్తనం చెలాయించడానికి చూస్తున్నారు.  ఇదే సమయంలో ఇటీవలే మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, ఆయన తనయుడు సుధీర్ టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. 2014లో శిద్ధా టీడీపీ తరుపున దర్శి నుంచి పోటీ చేసి గెలిచి, మంత్రిగా పనిచేశారు. ఇక ఆ విధంగా నియోజకవర్గంపై పట్టు ఉండటంతో, నెక్స్ట్ ఎన్నికల్లో తనకి గాని, తన కుమారుడుకు గాని దర్శి టిక్కెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు.

 

అయితే ఈ ఆధిపత్య పోరులో చివరికి ఎమ్మెల్యేకే చెక్ పడేలా ఉందని దర్శి వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే మద్దిశెట్టి పనితీరుపై సొంత పార్టీ వాళ్లే పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నియోజకవర్గాన్ని వదిలేసి సొంత వ్యాపారాలని చక్కదిద్దుకునే పనిలో ఉన్నారని, కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కడం కష్టమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: