కృష్ణా జిల్లాకు చివరిన ఉంటూ...గుంటూరు జిల్లాకు సరిహద్దుగా ఉండే దివిసీమ(అవనిగడ్డ)లో రాజకీయాలు ఎప్పుడు రెండు కుటుంబాల మధ్యే నడుస్తాయి. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి అవనిగడ్డ నియోజకవర్గంలో మండలి, సింహాద్రి ఫ్యామిలీల హవానే ఉంటుంది. 1972, 1978, 1983లలో మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్ నుంచి గెలిస్తే, 1985, 1989, 1994 ఎన్నికల్లో సింహాద్రి సత్యనారాయణరావు టీడీపీ నుంచి విజయం సాధించారు.

 

ఇక 1999, 2004 ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి మండలి వెంకటకృష్ణారావు తనయుడు మండలి బుద్దప్రసాద్ నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే 2009లో అంబటి బ్రహ్మణయ్య టీడీపీ నుంచి గెలవగా, ఆయన మరణం తర్వాత వచ్చిన 2013 ఉపఎన్నికల్లో అంబటి శ్రీహరి ప్రసాద్ టీడీపీ నుంచి గెలిచారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో మండలి బుద్దప్రసాద్ టీడీపీలోకి వచ్చి, 2014 ఎన్నికల్లో పోటీ చేసి, సింహాద్రి సత్యనారాయణ తనయుడు సింహాద్రి రమేశ్ బాబుపై విజయం సాధించారు.

 

అయితే సింహాద్రి రమేశ్ బాబు 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరుపున పోటీ చేసి ఓడిపోతే, 2019 ఎన్నికల్లో మాత్రం అదే పార్టీ నుంచి పోటీ చేసి మండలి బుద్దప్రసాద్‌పై గెలిచారు. ప్రస్తుతం దివిసీమని సింహాద్రి ఫ్యామిలీ ఏలుతుంది. ఇక టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన మండలి బుద్దప్రసాద్ ప్రస్తుతం రాజకీయాల్లో అంత యాక్టివ్ గా ఉండటం లేదు.

 

వయసు మీద పడటంతో మండలి నియోజకవర్గంలో కనిపించడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఈయన పోటీ చేయడం కష్టమనే తెలుస్తోంది. దీంతో టీడీపీ అధినాయకత్వం, ఆయన తనయుడు మండలి రాజాని దివిసీమ పోలిటికల్ స్క్రీన్‌పైకి తీసుకురావడానికి చూస్తుందని తెలుస్తోంది. ఎలాగో టీడీపీ నారా లోకేష్ చేతిల్లోకి వెళ్లబోతుంది కాబట్టి, ఈలోపు టీడీపీలో యువనాయకత్వం పెంచాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అందుకే నెక్స్ట్ ఎన్నికల్లో మండలి వారసుడు రాజా దివిసీమ బరిలో ఉండొచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: