అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోన్న తరుణంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించటం సాధ్యమవుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇదే సమయంలో రష్యా వ్యాక్సిన్ రెడీ అంటూ భారీగా ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవం ఏమిటంటే రష్యా వ్యాక్సిన్ ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ మాత్రమే పూర్తయ్యాయి. 
 
ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటివరకు రష్యా కేవలం ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్లపై మాత్రమే కరోనా వ్యాక్సిన్ ను ప్రయోగించింది. కానీ భారత్ లోని సోషల్, వెబ్ మీడియాలో మాత్రం మూడు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇతర దేశాల ప్రముఖ పత్రికల్లో మాత్రం రష్యా కరోనా వ్యాక్సిన్ గురించి ఎటువంటి వార్తలు రాలేదు. 
 
మన దేశంలో మాత్రమే ఈ రకమైన ప్రచారం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ ట్రాకర్ లో రష్యా ఇప్పటివరకు ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ మాత్రమే పూర్తి చేసినట్టు నమోదైంది. దీంతో మన దేశంలో మీడియా తప్పుడు సమాచారం రాసి పరువు పోగొట్టుకుందనే అభిప్రాయాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ ఇప్పట్లో అందుబాటులోకి రావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. 
 
పూర్తిస్థాయిలో కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్లైనా పడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2021 డిసెంబర్ నెలలోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా పూర్తిస్థాయిలో కరోనాను నియంత్రిస్తుందో లేదో చెప్పలేమని చెబుతున్నారు. మరోవైపు ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.                
 

మరింత సమాచారం తెలుసుకోండి: