క‌రోనా క‌ల‌క‌లం ఓ వైపు దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతుండ‌గా మ‌రోవైపు ఏడారి రాష్ట్రమైన రాజ‌స్తాన్‌లో స‌మీక‌ర‌ణాలు మారిపోతున్నాయి. సీఎం అశోక్‌ గెహ్లాట్‌పై డిఫ్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్‌పైలట్‌ తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం సోమవారం మరింత వేడెక్కింది. శాసనసభా పక్షం సీఎం గెహ్లాట్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిందని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించగా, తనవైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సచిన్‌ పైలట్‌ మరోసారి స్పష్టంచేశారు. నేడు మరోసారి సీఎల్పీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని విప్‌ జారీ చేసింది. దీంతో త‌దుప‌రి ఏం జ‌ర‌గ‌నుంద‌నే ఉత్కంఠ తెర‌మీద‌కు వ‌స్తోంది. అయితే, మ‌రో రాష్ట్రంపై బీజేపీ ఫోక‌స్ పెట్టిందా అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. 

 


రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతున్న స‌మ‌యంలో మ‌రోమారు మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వం మ‌నుగ‌డ‌పై సందేహాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఆ రాష్ట్రంలోని సంకీర్ణ ప్ర‌భుత్వంలో కీల‌క పార్టీ అయిన ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భాగ‌స్వామ్య పార్టీ అయిన‌ శివసేన అధికార ప‌త్రి‌ ‘సామ్న’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్‌ పవార్ బీజేపీ తీరుపై మండిప‌డ్డారు. శివసేనను పక్కన పెట్టి ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ అన్ని ప్ర‌య‌త్నాలు చేసింద‌ని  అయితే, ఆపరేషన్‌ లోటస్‌ మహారాష్ట్రలో విజయవంతం కాలేదని తెలిపారు. తమ కూటమిలో ఎలాంటి విబేధాలు లేవని, ఉద్ధవ్‌ థాకరే ప్రభుత్వం కచ్చితంగా ఐదేళ్లు సీఎంగా కాలపరిమితిని పూర్తి చేసుకుంటుందని పేర్కొన్నారు. 

 

కాగా, నేడు మరోసారి సీఎల్పీ సమావేశం జరుగనున్న త‌రుణంలో హాజ‌రుకావాల‌ని స‌చిన్ పైలట్‌ను కాంగ్రెస్‌ ఆహ్వానించినప్పటికీ ఆయన తిరస్కరించారు. మ‌రోవైపు సచిన్‌ పైలట్‌ బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అందువల్లనే యువనేత బీజేపీ తీర్థంపుచ్చుకోవటం ఆలస్యం అవుతున్నదని తెలుస్తున్నది. మరోవైపు పైలట్‌ బీజేపీలో చేరటంలేదని, సొంతపార్టీ పెట్టబోతున్నారని ఆయన సన్నిహితవర్గాలు అంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: