ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని మండల కేంద్రాల హైస్కూళ్లు ఇంటర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ కానున్నాయి. ఈ విషయం గురించి గత వారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ బోర్డ్ ఉన్నతాధికారులతో చర్చించారు. 
 
రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు పదో తరగతి తరువాత పై చదువుల పట్ల పెద్దగా ఆసక్తి చూపటం లేదని ఏపీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దూర భారం వల్లే చాలామంది విద్యార్థులు ఇంటర్ చదివేందుకు దూరమవుతున్నట్లు ఇంటర్ బోర్డ్ ఉన్నతాధికారులు విద్యాశాఖ మంత్రికి చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారంగా మండల స్థాయిలోనే ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అధికారులు మంత్రికి సూచనలు చేశారు. 
 
ఇలా చేయడం ద్వారా రాష్ట్రంలో ఇంటర్ అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లగా సీఎం వెంటనే ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. అధికారులు రాష్ట్రంలోని హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. మరోవైపు జగన్ సర్కార్ నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలను మారుస్తోంది. 
 
గతేడాది నవంబర్ 14వ తేదీన ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలు కోసం సంవత్సరానికి 1500 కోట్ల రూపాయల చొప్పున 6,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఆధునిక మూత్రశాలలను నిర్మించింది. ప్రతి తరగతి గదిలోనూ బెంచీలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆర్వో ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని విద్యార్థులకు అందించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: