దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ లాక్ డౌన్ తెర‌మీద‌కు వ‌స్తోంది. కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో జ‌న‌సంచారంపై రాష్ట్రాలు పున‌రాలోచ‌న‌లో ప‌డుతున్నాయి. వైరస్‌ ఉద్ధృతంగా ఉన్న చోట ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తున్నాయి. మ‌న పొరుగు రాష్ట్రం నుంచి మొద‌లుకొని దేశంలోని స‌రిహ‌ద్దు రాష్ట్రం వ‌ర‌కూ ఇదే దోర‌ణిలో ఉన్నాయి. పొరుగున ఉన్న కర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో నేటి నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తామని చేసిన ప్రకటన‌కు కొన‌సాగింపుగా తాజాగా ధార్వాడ్‌, దక్షిణ కన్నడ జిల్లాల్లోనూ లాక్‌డౌన్‌కు అనుమతినిచ్చింది. జమ్మూకశ్మీర్‌లో వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య వేగంగా  పెరుగుతుండటంతో అక్కడ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. 

 

దేశవ్యాప్తంగా మిగతా రాష్ర్టాల్లోనూ లాక్‌డౌన్‌ విధించాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క‌లోని ధార్వాడ్‌లో బుధవారం నుంచి 9 రోజులు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. దక్షిణ కన్నడ జిల్లాలో వారం రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రజలు, అధికారుల ఆకాంక్షల మేరకే మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు మంత్రి జగదీశ్‌ షెట్టర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని జేడీఎస్‌ నేత దేవెగౌడ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వర్‌ స్వాగతించారు. అయితే రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ విధించాలని డిమాండ్‌ చేశారు. 

 

కాగా, జ‌మ్ముక‌శ్మీర్‌లోనూ కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో అధికారులు కీల‌క చ‌ర్య‌లు తీసుకున్నారు. ఒక్క‌ శ్రీనగర్‌లోనే 88 కంటైన్మెంట్‌ ప్రాంతాలను గుర్తించారు. లాల్‌చౌక్‌ సహా అన్ని వ్యాపార సముదాయాలను మూసివేశారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించకుండా కశ్మీర్‌ లోయలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మాస్కు ధరించకపోతే రూ. 1000, కంటైన్మెంట్‌ జోన్లలో భౌతి క దూరం నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 10వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. అహ్మదాబాద్‌లో కూడా మాస్కు ధరించకపోతే జరిమానాను రూ. 200 నుంచి రూ. 500కు పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: