డ‌బ్బున్న‌వాళ్ల డిమాండ్ ఎలా ఉంటుంది? ఇంకా డ‌బ్బు సంపాదించాల‌నే ఉంటుంది? స‌్ప‌ష్టంగా చెప్పాలంటే వ్యాపారం చేసి డ‌బ్బులు సంపాదించే వాళ్ల ఆలోచ‌న అయితే...త‌మ‌కు సంపాద‌న‌కు ఇంకా చాన్సులు ఇవ్వాల‌ని కోరుకుంటుంటారు. కానీ వీళ్లు `తేడా`.  ఎందుకు ఎలా అంటే...కరోనా పిడికిల్లో చిక్కి యావత్‌ ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రస్తుత తరుణంలో.. మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా 80 మందికిపైగా ‘శ్రీమంతులు’ ముందుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాతృత్వం ఒక్కటే సమస్యను పరిష్కరించలేదని.. వైరస్‌ కట్టడికి అవసరమయ్యే నిధుల కోసం తమపై ‘పెద్ద ఎత్తున పన్ను’ విధించాలని స్వయంగా వారే ప్రభుత్వాలకు బహిరంగ లేఖ రాశారు. అలా మిగ‌తా డ‌బ్బున్న వారి దృష్టిలో తేడాగా ముద్ర ప‌డ్డార‌న్న మాట‌.

 

కరోనాపై ముందుండి పోరాడుతున్న వారికి రుణపడి ఉన్నామని చెప్పారు. అమెరికా, బ్రిటన్‌కు చెందిన మిలియనీర్లే ఎక్కువగా ఉన్న ఈ మ‌న‌సున్న వ్యాపారవేత్త‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ లేఖ రాశారు. ‘ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐసీయూలోని రోగుల బాగోగులను చూస్తున్నది మేము కాదు. అనారోగ్యం పాలైన వారిని ఆస్ప‌త్రుల‌కు చేర్చే అంబులెన్సులను మేం నడుపడం లేదు. ఇంటింటికీ ఆహారాన్ని డెలివరీ చేస్తున్నదీ మేము కాదు.. కానీ మావద్ద డబ్బుంది. చాలా ఉంది. ఇప్పుడు డబ్బు అత్యవసరం. వచ్చే కొన్ని ఏళ్ల‌లోనూ దీని అవసరం చాలా ఉంటుంది. ఈ నేపథ్యంలో మాలాంటి వారిపై పన్నులు పెంచాల్సిందిగా ప్రభుత్వాలను కోరుతున్నాం. తక్షణంగా, గణనీయంగా, శాశ్వతంగా’ అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. 

 


తమపై అత్యధిక పన్నులు విధించి నిధులు సేకరించాలని కీల‌క‌మైన ప్ర‌తిపాద‌న పెడుతూ వ్యాపార‌వేత్త‌లు లేఖ రాశారు. ‘ఈ సంక్షోభం ప్రభావం దశాబ్దాలపాటు కొనసాగనున్నది. దీని వల్ల 50 కోట్లమందికి పైగా ప్రజలు దారిద్య్రంలోకి జారుకునే ప్రమాదం ఉంది. లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోనున్నారు. ఇప్పటికే దాదాపు 100 కోట్లమంది పిల్లలు బడికి దూరమయ్యారు. దవాఖానల్లో బెడ్‌లు, మాస్కులు, వెంటిలేటర్లకు కొరత ఉండడం విచారకరం. ఇది ప్రజావైద్య వ్యవస్థల్లో తగినన్ని పెట్టుబడులు పెట్టకపోవడాన్ని గుర్తుచేస్తున్నది’ అని వారు లేఖలో పేర్కొన్నారు. ‘ఆలస్యం కాకమునుపే మన ప్రపంచాన్ని మళ్లీ సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని సరిచేసేందుకు మరో అవకాశం రాదు. ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ప్రజల్లాగా...మా ఉద్యోగం, ఉపాధి, కుటుంబాన్ని పోషించే ఆదరవు కోల్పోతామనే బెంగ మాకు లేదు. ఈ ఎమర్జెన్సీ సమయంలో మేం ముందుండి పోరాడడం లేదు. మేం బాధితులయ్యే అవకాశాలు  తక్కువ’ అని మిలియనీర్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: